కర్నాటక బిజెపి ఎమ్మెల్యే స్పందన
బెంగళూరు: దేశంలో వంటగ్యాసు, డీజిల్, పెట్రోలు ధరలు పెరగడానికి కారణం తాలిబన్లు , అఫ్ఘనిస్థాన్ సంక్షోభం అని కర్నాటక బిజెపి ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ తెలిపారు. ధరలు పెంచడాన్ని సమర్థించారు. అఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి దిగజారిందని, దీని వల్లనే ఇక్కడ గ్యాస్ , పెట్రో ధరలు పెరిగాయని వ్యాఖ్యానించారు.ముడిచమురు సరఫరాకు అఫ్ఘనిస్థాన్‌లో సంక్షోభం అడ్డంకి అయిందని, దీని వల్లనే సకాలంలో కోటా అందకపోవడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తేల్చిచెప్పారు. హుబ్లీ ధర్వాడ్ వెస్ట్ స్థానం ఎమ్మెల్యే అయిన బెల్లాడ్ చెప్పారు.
వంటగ్యాసు ధరల పెరుగుదల కారణాలను ఓటర్లు అర్థం చేసుకుంటారని, వారికి ఆ పరిణమతి ఉందని కూడా కితాబు ఇచ్చారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడిచమురు దిగుమతి , వినియోగ దేశంగా భారత్ రికార్డులలో ఉంది. భారత్ దిగుమతి చేసుకునే ప్రధాన విక్రేత దేశాల జాబితాలో ఎక్కడా అఫ్ఘనిస్థాన్ లేదు. అయితే అక్కడి సంక్షోభం వల్లనే ఇక్కడ కొరత, దీని వల్లనే ధరల పెంపుదల ఏర్పడిందని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదం అయింది.