Thursday, September 19, 2024

అమితాబ్‌పై పోలీసులకు బిజెపి ఎంఎల్‌ఎ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -
BJP MLA complaint to police about Amitabh Bachchan
కెబిసిలో హిందువుల మనోభావాలను గాయపరిచారు

ముంబయి: హిందువుల మనోభావాలను గాయపరిచిన ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, కౌన్ బనేగా కరోడ్‌పతి-12 టివి షో నిర్వాహకులు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహారాష్ట్రకు చెందిన బిజెపి ఎంఎల్‌ఎ ఒకరు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత శుక్రవారం ప్రసారమైన కరమ్‌వీర్ స్పెషల్ ఎపిసోడ్‌లో అమితాబ్ బచ్చన్ అడిగిన ఒక ప్రశ్నపై లాటూర్ జిల్లాలోని ఔసాకు చెందిన బిజెపి ఎంఎల్‌ఎ అభిమన్యు పవార్ లాటూర్ ఎస్‌పి నిఖిల్ పింగ్లేకు ఫిర్యాదు చేశారు. హిందువులను అవమానించి సామరస్యంతో జీవిస్తున్న హిందువులు, బౌద్ధుల మధ్య విద్వేషాన్ని రగల్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఎస్‌పికి అందచేసిన రెండు పేజీల తన ఫిర్యాదు లేఖ ప్రతిని అభిమన్యు పవార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గత శుక్రవారం ప్రసారమైన కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రత్యేక ఎపిసోడ్‌లో సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోని పాల్గొన్నారు. వారికి అమితాబ్ వేసిన రూ. 6.40 లక్షల విలువైన ప్రశ్న ఇలా ఉంది..

1927 డిసెంబర్ 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన అనుచరులు తగులబెటిన గ్రంథమేది?
దీనికి ఆప్షన్లు: (ఎ) విష్ణు పురాణం (బి) భగవద్గీత (సి) రుగ్వేదం (డి) మనుస్మృతి.

ఈ ప్రశ్నకు అమితాబ్ బచ్చన్ జవాబిస్తూ కుల వివక్షను, అంతరానితనాన్ని వ్యతిరేకిస్తూ 1927లో అంబేద్కర్ పురాతన హిందూ మతగ్రంథం మనుస్మృతి ప్రతులను తగులబెట్టారని చెప్పారు. ఈ నాలుగు ఆప్షన్లు హిందూ మతానికి చెందినవేనని, హిందువుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రశ్న వేశారని స్పష్టమవుతోందని పవార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూ మత గ్రంథాలను దగ్ధం చేయాలన్న సందేశాన్ని ఈ ప్రశ్న తెలియచేస్తోందని, హిందువులు, బౌద్ధుల మధ్య శత్రుత్వాన్ని ఇది రగిలిస్తోందని ఆయన తన ఆరోపించారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సన్నిహితుడైన అభిమన్యు పవార్‌తోపాటు పలువురు నెటిజన్లు కూడా కెబిసి ఎపిసోడ్‌లో అమితాబ్ వేసిన ఈ ప్రశ్నపై మండిపడుతున్నారు. లెఫ్టిస్టు భావజాలాన్ని కెబిసి ప్రచారం చేస్తోందని కొందరు ఆరోపించగా హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.సినీ నిర్మాత వివేక్ అగ్నిహోత్రి కూడా ట్విట్టర్‌లో దీనిపై స్పందిస్తూ కెబిసిని కమ్యూనిస్టులు హైజాక్ చేశారంటూ వ్యాఖ్యానించారు. సాంస్కృతిక యుద్ధాలను ఎలా గెలిచారో దీని ద్వారా అభం శుభం తెలియని పిల్లలు నేర్చుకుంటారంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News