Wednesday, January 22, 2025

శివసేన నేతపై బిజెపి ఎమ్మెల్యే కాల్పులు..

- Advertisement -
- Advertisement -

థాణె: మహారాష్ట్రలోని ధాణె జిల్లాలో ఒక భూ వివాదంపై ఏక్‌నాథ్‌షిండే వర్గానికి చెందిన శివసేన నాయకుడిపై పోలీసు స్టేషన్‌లోనే కాల్పులు జరిపి గాయపరిచారన్న ఆరోపణలపై మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఉల్హాస్‌నగర్ ప్రాంతంలోని హిల్ లైన్ పోలీసు స్టేషన్‌లో సీనియర్ ఇన్‌స్పెక్టర్ చాంబర్‌లోపల శుక్రవారం రాత్రి కళ్యాణ్‌కు చెందిన శివసేన అధ్యక్షుడు మహేష్ గైక్వాడ్‌పై కళ్యాణ్ నియోజకర్గ బిజెపి ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కాల్పులు జరిపినట్లు అదనపు పోలీసు కమిషనర్ దత్తాత్రేయ షిండే శనివారం విలేకరులకు తెలిపారు.

పోలీసు స్టేషన్‌లో తన కుమారుడిని కొట్టినందుకు తాను తన గన్‌ను ఉపయోగించానని అరెస్టుకు ముందు ఒక న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ గణపత్ గైక్వాడ్ తెలిపారు. మహారాష్ట్రలో నేరస్తుల సామ్రాజ్యాన్ని నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాల్పులలో గాయపడిన మహేష్ గైక్వాడ్‌ను ఒక స్థానిక ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి థాణెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందచేస్తున్నారు.

మహేష్ గైక్వాడ్‌కు సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని శివసేన కళ్యాణ్ ఇన్‌చార్జ్ గోపాల్ లాండ్గే తెలిపారు. ఒక భూవివాదంపై ఫిర్యాదు చేసేందుకు గణపతి గైక్వాడ్ కుమారుడు పోలీసు స్టేషన్‌కు వచ్చారని, అదే సమయంలో మహేష్ గైక్వాడ్ కూడా తన అనుచరులతో పోలీసు స్టేషన్‌కు వచ్చారని ఎసిపి తెలిపారు. అనంతరం గణపత్ గైక్వాడ్ కూడా అక్కడకు చేరుకున్నారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేకు, శివసేన నాయకుడికి మధ్య వాగ్వాదం జరిగిందని, ఇన్‌స్పెక్టర్ చాంబర్‌లోనే మహేష్ గైక్వాడ్‌పై గణపత్ గైక్వాడ్ కాల్పులు జరపడంతో మహేష్, ఆయన అనుచరుడు గాయపడ్డారని ఎసిపి తెలిపారు.

కాగా..తానే స్వయంగా కాల్పులు జరిపానని, ఇందుకు తాను బాధపడడం లేదని న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ గణపత్ గైక్వాడ్ ఒప్పుకున్నారు. పోలీసు స్టేషన్‌లో పోలీసుల ముందే తన కుమారుడిని కొడితే తాను ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. తాను ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో కేవలం నేరస్తులే పుడతారని, తనలాంటి మంచి వ్యక్తిని కూడా నేడు నేరస్తుడిగా మార్చాడని ఆయన ఆరోపించారు. గణపత్ గైక్వాడ్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా..మహారాష్ట్రలో బిజెపి, షిండే సారథ్యంలోని శివసేన కూటమి అధికారంలో ఉండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News