జైపూర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కోవిడ్ బారినపడి రాజస్థాన్ లోని ధారివాడ్‌కు నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఎ గౌతమ్ లాల్ మీనా(56) చికిత్స పొందుతూ బుధవారం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌లోని ఎంబి ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. గత రెండు రోజులుగా అతని పరిస్థితి వేగంగా క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే పరిస్థితి మరింత విషయమించడంతో తుదిశ్వాస విడిచారు. గౌతమ్ లాల్ మీనా 2013 నుంచి 2018 వరకు ధారివాడ్ నుండి మూడుసార్లు ఎంఎల్ఎగా గెలుపొందారు.
ఆయన ఇంతకు ముందు ధారివాడ్ పంచాయతీ సమితి ప్రధాన్ గా ఉన్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, గులాబ్ చంద్ కటారియా సంతాపం ప్రకటించారు. ఇంతకు ముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కైలాష్ త్రివేది, గజేంద్ర శక్తివత్, బిజెపి ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. మాములు జనంతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు వైరస్ బారినపడి మరణిస్తున్నారు.