యుపి బిజెపి ఎమ్మెల్యే మండిపాటు
లక్నో: కరోనా వైరస్ నిరోధక వ్యాక్సిన్‌కు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ధరను నిర్ణయించడంపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే రాధామోహన్ దాస్ అగర్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరమ్ సిఇఓ అదర్ పూనావాలాను బందిపోటుగా అభివర్ణిస్తూ అంటువ్యాధుల నిరోధక చట్టం(ఇడిఎ) కింద సీరమ్ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిషీల్డ్ టీకాను డోసుకు రూ. 600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400గా ధరలను నిర్ణయిస్తూ సీరమ్ సంస్థ బుధవారం చేసిన ప్రకటనపై బిజెపి ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు.
అదర్ పూనావాలను బందిపోటు కన్నా నీచునిగా ఆయన ఒక ట్వీట్‌లో అభివర్ణించారు. అంటువ్యాధుల నిరోధక చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీని జప్తు చేసుకోవాలని వైద్యుడు కూడా అయిన అగర్వాల్ డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటల ఖర్చులను, కొనుగోలు ధరలకు సంబంధించిన స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన సూత్రాన్ని కూడా అగర్వాల్ ప్రస్తావించారు.