సోన్‌భద్ర: అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఎకు స్థానిక కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నెల 12న ఎంఎల్‌ఎను దోషిగా నిర్ధారించిన కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది.ఈ నేపథ్యంలో ఆయన శాసనసభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఈ ఘటన జరిగింది. బిజెపి ఎంఎల్‌ఎ రాందులార్ గోండ్ ఏడాదిగా తనపై లైంగిక దాడులకు పాల్పడిట్లు 15 ఏళ్ల బాలిక తొమ్మిదేళ్ల క్రితం ఆరోపించింది. బాలిక సోదరుడి ఫిర్యాదుతో 2014 నవంబర్ 4న రాందులార్ గోండ్‌పై ఐపిసి సెక్షన్లతో పాటుగా పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కేసు నమోదు చేసినప్పుడు రాందులార్ గోండ్ ఎంఎల్‌ఎగా లేరు. కానీ ఆయన భార్య సూర్తన్ దేవి గ్రామసర్పంచ్‌గా ఉన్నారు. 2018లో రాందులార్ బిజెపిలో చేరారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దుద్ది ఎస్‌టి రిజర్వ్‌డ్ నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఎంఎల్‌ఎగా గెలుపొందారు.
దీంతో ఆయనపై నమోదయిన అత్యాచారం కేసును ఎంపిలు, ఎంఎల్‌ఎ కోర్టుకు బదిలీ అయింది. విచారణ జరిపిన జడ్జి అహసాన్ ఉల్లా ఖాన్ బిజెపి ఎంఎల్‌ఎ రాందులార్ గోండ్‌ను ఈ నెల 12న దోషిగా నిర్ధారించారు.శుక్రవారం శిక్షలను ఖరారు చేస్తూ 25 ఏళ్ల జైలు విక్ష విధించారు. దీంతో పాటుగా ఆయనకు రూ.10 లక్షల జరిమానా కూడా విధించారు. ఈ మొత్తాన్ని బాధితురాలి పునరావాసం ఉపయోగించాలని సూచించారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా కోర్టు తీర్పు పట్ల బాధితురాలి సోదరుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లా జైలులో ఉన్న ఎంఎల్‌ఎను పోలీసులు కోర్టుకు తీసుకువచ్చి తీర్పు తర్వాత తిరిగిజైలుకు తీసుకెళ్లారు. తీర్పు నేసథ్యంలో రాందులార్ గోండ్ శాసన సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు. సమాజ్‌వాది పార్టీ నేత ఆజమఖ ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజమ్ ఖాన్, బిజెపి ఎంఎలె విక్రమ్ సింగ్ సైని తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.