మహారాష్ట్రలో దిగ్భ్రాంతి గొలిపే సంఘటన చోటు చేసుకుంది. ముంబయిలోని ఉల్హాస్ నగర్ లో బిజేపీకి చెందిన ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ శివసేన (ఏక్ నాథ్ వర్గం)కు చెందిన నాయకుడు మహేశ్ గైక్వాడ్ పై శుక్రవారం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన హిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో జరగడం గమనార్హం. ఒక భూవివాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఇద్దరి మధ్యా వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆవేశం పట్టలేక మహేశ్ గైక్వాడ్ పై పోలీస్ స్టేషన్ లోనే కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మహేశ్ ను థానేలోని జూపిటర్ ఆస్పత్రికి తరలించి, ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముందుగా పోలీస్ స్టేషన్ కు గణపత్ గైక్వాడ్ కుమారుడు ఫిర్యాదు చేసేందుకు వచ్చారని, ఆ తర్వాత మహేశ్ గైక్వాడ్, గణపత్ గైక్వాడ్ విడివిడిగా వచ్చారని పోలీసులు తెలిపారు. గైక్వాడ్ కల్యాణ్ లోని కల్యాణ్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.