Monday, November 18, 2024

మాజీ గవర్నర్ కుమారుడికి నిరాశ….

- Advertisement -
- Advertisement -

బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు పార్టీ అధిష్ఠానం మొండిచెయ్యి చూపించింది. వికాస్ రావు వేములవాడ టికెట్ ను ఆశించారు. మంగళవారం వెల్లడైన బిజేపీ నాలుగో జాబితాలో వేములవాడ టికెట్ తుల ఉమకు లభించింది. దీంతో వికాస్ నిరుత్సాహానికి గురయ్యారు. వృత్తిరీత్యా డాక్టర్లయిన వికాస్, దీప దంపతులు గత ఆగస్టులో బిజేపీలో చేరారు. అప్పటినుంచీ వేములవాడ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. చిన్నప్పటినుంచీ సంఘ్ పరివార్ తో అనుబంధం ఉన్న వికాస్ కు వేములవాడ ప్రాంతంలో చెప్పుకోదగిన పేరుంది. ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఆయన నియోజకవర్గం పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

వేములవాడ చాలాకాలంగా చెన్నమనేని కుటుంబానికి పెట్టనికోటగా ఉంది. చెన్నమనేని రాజేశ్వరరావు ఆరుసార్లు ఇక్కడినుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సోదరుడే విద్యాసాగర్ రావు. రాజేశ్వరరావు కుమారుడు చెన్నమనేని రమేశ్ బాబు వేములవాడనుంచి నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట 2009లో తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచిన రమేశ్, ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరి, మూడుసార్లు ఎన్నికయ్యారు. అయితే ఆయన పౌరసత్వంపై వివాదం నడుస్తున్న దృష్ట్యా ఈసారి బీఆర్ఎస్ ఆయనకు కాకుండా, చెల్మెడ లక్ష్మీ నరసింహారావు టికెట్ ఇచ్చింది.  వేములవాడ నియోజకవర్గంలో తన కుటుంబానికి ఉన్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, వికాస్ ను ఇక్కడినుంచే పోటీకి దించాలని విద్యాసాగరరావు భావించారు. కానీ, అధిష్ఠానం నిర్ణయం మరోలా ఉండటంతో ఆయనకు నిరాశ తప్పలేదు.

వేములవాడ బీజేపి టికెట్ దక్కించుకున్న తుల ఉమ గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకప్పుడు నక్సలిజంపట్ల ఆకర్షితురాలై, పదేళ్లపాటు అజ్ఞాతంలో గడిపిన ఉమ, 1994లో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. అదే ఏడాది సిపిఐ (ఎంఎల్) తరపున జగిత్యాల నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. 2001లో టిఆర్ఎస్ లో చేరారు. 2014లో కరీంనగర్ జిల్లా చైర్ పర్సన్ అయ్యారు. ఆమె 2021లో టిఆర్ఎస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.

బీజేపి నాలుగో జాబితాలో మునుగోడు టికెట్ చలమల కృష్ణారెడ్డికి దక్కింది. చలమల కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ లో చేరి, మునుగోడు టికెట్ సాధించుకోవడంతో చలమల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, బిజేపిలో చేరారు. పార్టీ మంగళవారం ప్రకటించిన నాలుగో జాబితాలో చలమల పేరు ఉండటంతో ఆయన అభిమానులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News