కర్నాటక గవర్నరుకు రాష్ట్ర బిజెపి వినతి ..స్పీకర్ కట్టడికి అభ్యర్థన
బెంగళూరు : కర్నాటకలో అప్పట్లో 18 మంది బిజెపి ఎమ్మెల్యేల అసెంబ్లీ సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ వద్దకు చేరింది. తమ పార్టీ ఎమ్మెల్యేలపై విధించిన సామూహిక బహిష్కరణను రద్దు చేయాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్‌ను ప్రతిపక్ష హోదాలో ఉన్న బిజెపి సోమవారం అభ్యర్థించింది. సస్పెన్షన్ అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం అని బిజెపి విమర్శించింది. ఎమ్మెల్యేలపై వేటు నిర్ణయాన్ని స్పీకర్ యుటి ఖాదెర్ పునరాలోచించుకునేలా ఆదేశాలు వెలువరించాలని, ఈ మేరకు గవర్నర్ తమ రాజ్యాంగ కర్తవ్యం నిర్వహించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బివై విజయేంద్ర, అసెంబ్లీలో విపక్ష నేత ఆర్ అశోకా నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో కలిసింది.
గవర్నర్ తమ ఫిర్యాదును పరిశీలించి, సస్పెన్షన్లు ఎత్తివేయించేలా చూడాలని వారు కోరారు. మార్చి 21వ తేదీన అసెంబ్లీలో అసాధారణ రీతిలో బిజెపి ఎమ్మెల్యేలు 18 మందిపై వేటు పడింది. స్పీకర్ పట్ల క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని, సభా మర్యాదను దెబ్బతీశారని పేర్కొంటూ వారిని సభ నుంచి గెంటేశారు. వారు సభ నుంచి వెళ్లడానికి నిరాకరించి సభలోనే భైఠాయించడంతో వారిని మార్షల్స్ వచ్చి బయటకు తీసుకువెళ్లారు. ఈ ఘటనపై అప్పటి నుంచి బిజెపి తీవ్ర స్థాయి నిరసనలకు దిగుతూ వస్తోంది. గౌరవనీయ గవర్నర్ వెంటనే ఈ విషయంలో కలుగచేసుకుని తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని, సస్పెన్షన్లను ఎత్తివేసేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయిన తమ పార్టీ పట్ల ఇంతటి అవమానం అనుచితం అవుతుందని , ఈ విషయంలో న్యాయం జరగాల్సి ఉందని కోరారు.
ప్రజలతో ఎన్నికైన వీరు తిరిగి ప్రజా ప్రతినిధులుగా బాధ్యతలు నిర్వర్తించే వీలు కల్పించాల్సి ఉందని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ చివరి రోజున అసెంబ్లీలో గందరగోళం , తరువాత సభ్యుల బహిష్కరణ వరకూ తంతు సాగింది. రాష్ట్రంలో ముస్లింలకు పబ్లిక్ కాంట్రాక్ట్‌లలో 4 శాతం రిజర్వేషన్ కల్పించే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బిజెపి పెద్ద ఎత్తున వ్యతిరేకంచింది. అసెంబ్లీలో నిరసనలకు దిగింది. రాష్ట్ర సహకార మంత్రి హానీట్రాప్ వ్యవహారంపై జుడిషియల్ దర్యాప్తునకు కూడా బిజెపి పట్టుబట్టింది. నిరసనల క్రమంలో బిజెపి ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానం వద్ద ఉండే గోడపైకి చేరారు. చుట్టుముట్టారు. వెల్‌లోకి దూసుకువెళ్లడం, స్పీకర్‌పైకి కాగితాలు చింపి విసిరికొట్టడం వంటి ఘటనలు జరిగాయి. దీనితో స్పీకర్ ఈ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి , బయటకు పంపించారు.