ఎల్‌జి సక్సేనాకు లేఖ రాసిన ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు సచ్‌దేవా
న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మరునాడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వినయ్ కుమార్ సక్సేనాతో తమ కొత్త ఎంఎల్‌ఎల సమావేశానికి సమయం కోరుతూ ఆదివారం లేఖ పంపింది. కొత్తగా ఎన్నికైన 48 మంది పార్టీ ఎంఎల్‌ఎలు, నగరం నుంచి ఏడుగురు లోక్‌సభ ఎంపిలతో సమావేశానికి అపాయింట్‌మెంట్ కోరుతూ సక్సేనాకు ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా లేఖ రాశారు. ‘ఢిల్లీకి చెందిన బిజెపి ఎంపిలు, కొత్తగా ఎన్నికైన మా 48 మంది ఎంఎల్‌ఎలతో పాటు నేను వీలైనంత దగ్గర తేదీన మీతో సమావేశం కావాలని అభిలషిస్తున్నా.
దయచేసి మీ వీలు ప్రకారం సమీపంలో ఒక తేదీన అపాయింట్‌మెంట్ ఇవ్వవలసింది’ అని ఆయన ఎల్‌జికి రాశారు. బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించి 26 ఏళ్ల తరువాత ఢిల్లీలో అధికారంలోకి తిరిగి వచ్చింది. 70 అసెంబ్లీ సీట్లలోకి 22 సీట్లను ఆప్ గెలుచుకున్నది. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ దక్కలేదు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత ప్రభుత్వం ఏర్పాటు జరగవచ్చునని బిజెపి నేతలు సూచించారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఊహాగానాలు పార్టీలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన సీనియర్ నేతలు పలువురి పేర్లు సిఎం పదవికి వినిపిస్తున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ ఆప్ కన్వీనర్, మూడు సార్లు ముఖ్యమంత్రి అర్విండ్ కేజ్రీవాల్‌పై విజయంతో ఘనాపాఠీని ఓడించిన ఖ్యాతిని గడించారు.