బెంగళూరు: కర్నాటక బిజెపి ఎంఎల్‌ఎ కుమారుడు కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయాడు. ముడి సరుకుల కొనుగోలు టెండర్ ఇప్పిస్తానంటూ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెండ్‌గా డొంకంతా కదిలినట్టు దీన్ని ఆసరాగా చేసుకుని అతని ఇంట్లో సోదాలు చేస్తే అవినీతి బండారం అంతా బయటపడింది. ఆయన నివాసంలో రూ.6 కోట్ల నోట్ల గుట్టలను గుర్తించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. వివరాలలోకి వెళితే.. కర్నాటక లోని దావణగెరె జిల్లా చెన్నగిరి శాసనసభ్యుడు మాడాళు విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్ ముడి వస్తువుల కొనుగోలుకు టెండరు ఇప్పిస్తానంటూ ఒక గుత్తేదారు నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి లోకాయుక్త అధికారులకు దొరికిపోయాడు. బెంగళూరు జలమండలిలో చీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న ప్రశాంత్ ఈ టెండరు విషయంలో రూ.80 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
కాంట్రాక్టరు లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రశాంత్ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. ఆఫీసులోనే లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్న అధికారులు హుటాహుటిన అతడి నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఇంకేముంది కళ్లు చెదిరే రీతిలో ఇంట్లోనే కట్టల కొద్దీ కరెన్సీ బయటపడింది. మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసే ప్రభుత్వ ఆధీనంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు ఎంఎల్‌ఎ విరూపాక్షప్ప ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ను అధికారులు కెఎస్‌డిఎల్ కార్యాలయంలోనే అరెస్టు చేశారు. మూడు బ్యాగుల్లో రూ.2.2 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆయన ఇంట్లో రూ. 6 కోట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇదిలావుండగా కర్నాటకలో బిజెపి అధికారంలో ఉంది. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. పర్సెంటేజ్ ప్రభుత్వం అని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి ప్రభుత్వం తాజా ఘటనతో మరింత ఇరకాటంలో పడింది. ఇప్పటికే సిఎం బసవరాజ్ బొమ్మైతో సహా అక్కడి నేతలపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కుమారుడు లంచం వ్యవహారం బయటపడంతో ఎంఎల్‌ఎ విరూపాక్షప్ప కెఎస్‌డిఎల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కెఎస్‌డిఎల్ కార్యాలయంలోనే లంచం డబ్బును లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకోవడంతో బిజెపి ఎంఎల్‌ఎపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
ఎంఎల్‌ఎ విరూపాక్షప్ప కుమారుడి గుట్టు బయటపడంతో ముఖ్యమంత్రి బొమ్మై స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దోషులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుడు, విపక్ష నేత సిద్ధరామయ్య ప్రశాంత్ లంచావతారంపై తీవ్రంగా మండిపడ్డారు. కర్నాటకలో కమీషన్ల ప్రభుత్వం ఉందని మరోసారి నిరూపితమైందన్నారు.