మనతెలంగాణ/ హైదరాబాద్ : మరో మూడు నెలలో జరగబోయే శాసనసభ ఎన్నికలకు బిజెపి సమాయత్తమవుతోంది. ఎన్నికల దృష్టా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు పర్యటించేలా ఆ పార్టీ అధిష్టానం కార్యాచరణను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. దాదాపు వారం నుంచి పది రోజుల పాటు ఆయా ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిస్తారు.
నియోజకవర్గంలో ఒక్కో రోజు ఒక్కో మండలంలో వారు విస్తృతంగా తిరుగనున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దృష్టి పెట్టే అంశాలపైనా వారు దృష్టిసారించనున్నారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజలకు ఏం కావాలి అనే అంశాలను నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తెలుసుకోనున్నారు. వాటిపై ఒక నివేదికను రూపొందించి దానిని ఢిల్లీ పెద్దలకు అందించనున్నారు. వాటి అనుగుణంగా ఎన్నికలకు మాస్టర్ ప్లాన్‌ను, వ్యూహాలను రచించి అధికార పార్టీకి చెక్ పెట్టాలని బిజెపి అగ్రనేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తెలంగాణకు చేరుకున్నారు. శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలతో వారు సమావేశమవుతారు. సంపర్క్ సే సమర్థన్ లో భాగంగా ప్రముఖులను కలవనున్నారు. అంతేకాకుండా దళిత, గిరిజన కార్యకర్తల ఇండ్లకు వెళ్లనున్నారు.