పురూలియా: బిజెపిని మావోయిస్టుల కన్నా ప్రమాదకారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. ఎన్నికల ముందు ప్రజలకు బిజెపి బూటకపు వాగ్దానాలు చేస్తోందని మంగళవారం పురూలియా జిల్లాలో ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆమె ఆరోపించారు.
ఏప్రిల్-మే నెలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో పార్టీ నుంచి జరుగుతున్న వలసలను ఆమె ప్రస్తావిస్తూ రాజకీయాలు సైద్ధాంతిక నిబద్ధతతో కూడుకున్నవని, దుస్తులు మార్చినంత తేలికగా పార్టీలు మారడం తగదని వ్యాఖ్యానించారు. బిజెపిలో చేరదలచిన వారు నిరభ్యంతరంగా తమ పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని, కాషాయం పార్టీకి తలవంచే ప్రసక్తే లేదని టిఎంసి అధినేత్రి స్పష్టం చేశారు. పురూలియా జిల్లాలోని జంగల్‌మహల్ ప్రాంత ఆదివాసులకు బూటకపు వాగ్దానాలు చేసిన బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారి మొహం కూడా చూడలేదని ఆమె ఆరోపించారు.