బిజెపి ఎంపి దియా కుమారి వెల్లడి
జైపూర్: ఆగ్రాలో తాజ్ మహల్ నిర్మించిన స్థలం జైపూర్ రాజు జైసింగ్‌దని, ముఘల్ పాలకుడు షాజహాన్ ఆ స్థలాన్ని తీసుకుని అక్కడ తాజ్‌మహల్ నిర్మించాడని బిజెపి ఎంపి దియా కుమారి బుధవారం వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రికార్డులు అలనాటి జైపూర్ రాజకుటుంబం వద్ద ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తాజ్‌మహల్ చరిత్రపై నిజనిర్ధారణ కమిటీని వేయడంతోపాటు తాజ్‌మహల్‌లో తాళాలు వేసి ఉంచిన 22 గదులను తెరిపించి నిజానిజాలు వెలుగులోకి తేవాలని కోరుతూ ఆమె అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజ్‌మహల్ నిర్మాణానికి ముందు ఆ స్థలంలో ఏముందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, అందుకోసం దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. ఆ స్థలానికి సంబంధించిన రికార్డులు జైపూర్ రాజకుటుంబం వద్ద ఉన్నాయని, అవసరమైతే వాటిని కోర్టుకు అందచేస్తామని ఆ కుటుంబానికి చెందిన దియా కుమారి తెలిపారు.
బుధవారం నాడిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్థలానికి బదులుగా జైపూర్ రాజుకు పరిహారం అందచేశారని, అయితే అది ఎంతమొత్తం..దాన్ని జైపూర్ రాజు ఆమోదించారా లేదా అన్నది తాను చెప్పలేనని, తమ కోశాగారంలో ఉన్న ఆ రికార్డులను తాను ఇంకా చదవవలసి ఉందని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఆ భూమి తమ కుటుంబానికి చెందినదని, దాన్ని షాజహాన్ తీసుకున్నారని ఆమె చెప్పారు. తాజ్‌మహల్‌లోని 22 గదులను ఎందుకు మూసి ఉంచారో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఆమె చెప్పారు.తాజమహల్ నిర్మాణానికి ముందు అక్కడ ఆలయంతోసహా ఏదైనా ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.