Thursday, January 23, 2025

బిజెపి మల్లుడిపై కీచక కేసులు

- Advertisement -
- Advertisement -

సుప్రీంకోర్టు ఆదేశించటంతో విధిలేని స్థితిలో లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న బిజెపి ఎంపి, మల్లుడు, నలభై కేసులున్న నేరచరితుడైన రెజ్లింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ మీద అమిత్ షా ఆధీనంలో పని చేసే ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన పోక్సో కేసు. ఒక కేసు నమోదు చేసేం దుకు దేశ ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్న వార్త ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పుకుం టున్న దేశ పరువును తీసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, పాలక పార్టీ పెద్దలు, వారి సమర్ధకులు తప్ప వేరెవరూ కారణం కాదు. బేటీ పఢావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్ర మోడీ ఏలుబడిలో ఆయన అధికార పీఠం ఉన్న చోటే ఆఫ్టరాల్ ఒక కేసు నమోదుకు ఇంత రచ్చ జరిగిందంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుం దా అని జనం ఆశ్చర్యపోతున్నారు.

అంతకు ముందు జరిగిన పరిణామాల్లో అఫ్‌కోర్స్ ఎవరేమనుకుంటే నాకేటి…. అనుకున్న ట్లుగా ఒకనాడు పరుగుల రాణిగా దేశప్రజల, క్రీడాకారుల నీరాజనాలు అందుకున్న పిటి ఉష రెజ్లర్ల మీద విమర్శలకు దిగి పరువు పొగొట్టుకున్నారు. ఇప్పుడేమంటారో చూడాలి. ఢిల్లీ పోలీ సుల మీద ఎవరికీ విశ్వాసం లేదు. కేసు నీరుగారేట్లు చేస్తారని అనేక మంది భావిస్తున్నారు. బహుశా ఈ దుమ్ముతోనే కేసులు పెట్టినా తాను రెజ్లింగ్ ఫెడరేషన్ పదవికి రాజీనామా చేసేది లేదని బ్రిజ్‌భూషణ్ ప్రకటించారు. కేసులు నమోదు చేశాం కనుక ఆందో ళన విరమించండి, జంతర్ మంతర్ నుంచి వెళ్లిపోండి అంటూ శరవేగంతో వచ్చిన పోలీసులు ఆందోళన శిబిరంలో ఉన్న వారికి నీరు, ఆహారం అందకుండా అడ్డుకున్నారు.వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేసి మల్లయుద్ధ క్రీడాకారులు దేశ ప్రతిష్ఠను మంటగలిపారంటూ భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) అధ్యక్షురాలు పిటి ఉష ఆరోపించారు.

రోడ్లెక్కే ముందు కు ఐఒఎను సంప్రదించి ఉండాల్సిందంటూ హితవు పలికారు. మల్లయోధులు తమ అసోసియేషన్‌కు తాత్కాలిక కమిటీ వేయాల ని కోరారని, తామాపని చేసినట్లు ఉష చెప్పారు. అంతకు ముందు జరిగిన ఐఒఎ కార్యవర్గ సమావేశం తరువాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎల్లవేళలా ఆటగాళ్ల పక్షానే ఉందని, క్రీడలు, అథ్లెట్లు తమ ప్రాధాన్యత అని చెప్పుకున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద విమర్శలు వచ్చిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలను చూస్తే అతగాడిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి చూపు తున్న శ్రద్ధ్ద నిజాలను నిగ్గుదేల్చేందుకు చూపలేదు. నిజానికి రెజ్లర్లను వీధుల్లోకి లాగింది, దేశ ప్రతిష్ఠను దిగజార్చిందీ కేంద్రం, బిజెపి పార్టీతప్ప మరొకటి కాదు. బిజెపి నేత అద్వానీ మీద హవాలా ఆరోపణ వచ్చినపుడు ఎంపిగా రాజీనామా చేసి ఆ నింద తొలగిన తరువాతనే తిరిగి ఎన్నికల్లో నిలిచారు. బ్రిజ్ భూషణ్ అంశంలో బిజెపి ఎందుకు ఠలాయిస్తున్నట్లు? వెంటనే పదవి నుంచి తప్పించి విచారణ సక్రమంగా జరిపించి ఉంటే ప్రపంచ క్రీడా రంగంలో, ఇతరంగా దేశ పరువు నిలిచేది కదా!
రాజ్యసభకు పంపినందుకు బిజెపి పట్ల కృతజ్ఞతగా బహుశా పిటి ఉష ఈ కోణాన్ని చూడకుండా రెజ్లర్ల మీదనే దాడికి దిగారన్నది స్పష్టం. నిరసన తెలపటం ప్రజాస్వామిక హక్కు, ఒక మహిళగా తోటి మహిళా అథ్లెట్ల బాధను ఆమె అవగాహన చేసుకోలేదు. అన్ని రంగాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్న సంగతి తెలి యదని అనుకోవాలా? ఇతర అసోసియేషన్లలో చేయని ఆరోపణలు రెజ్లింగ్‌లోనే ఎందుకు వచ్చినట్లు? రెజ్లర్లు తమ వద్దకు రాలేదని చెబుతున్న ఉష, ఆమే వారిని తన వద్దకు ఎందుకు పిలిపించుకోలేదు. జనవరి 18న తొలిసారిగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ఆమె రంగంలోకి దిగితే ఇంతదాకా వచ్చేది కాదు కదా! తాత్కాలిక కమిటీని తమంత తాముగా ఎందుకు వేయలేదు? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తటం సహజం. లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలతో దేశం పరువు తీసినట్లు, పోయినట్లు బిజెపి ఇప్పటికీ నానాయాగీ చేస్తోంది. ఇప్పుడు అదే భాషను పరుగుల రాణి వినిపించారు. నిరసన తెలపటమే నేరం అన్నట్లు మాట్లాడారు? బిజెపి గీసిన గిరి నుంచి వెలుపలికి వస్తే ప్రపంచంలో గతంలో,’

వర్తమానంలో జరుగుతున్నదేమిటో ఆమెకు తెలిసి ఉండేది. అసలు ఆమె సంగతేమిటి ఆమె క్రమశిక్షణ బండారమేమిటి? పిటి ఉష రాజకీయ రంగు దాస్తే దాగేది కాదు. క్రీడా రంగంలో ఉన్నంత వరకే ఆమె క్రీడాకారిణి. తరువాత సాధారణ పౌరురాలే. ఏ రాజకీయ పార్టీనైనా అభిమానించవచ్చు, చేరవచ్చు. ఆమె నెరపి న రాజకీయం ఏమిటో కేరళ జనాలకు తెలుసు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఏ క్షణంలోనైనా బిజెపిలో చేరవచ్చని 2021 పత్రికలను తిరగేస్తే వచ్చిన వార్తలు చూడవచ్చు. విజయ యాత్ర జరిపిన బిజెపి చివరికి ఉన్న ఒక్క అసెంబ్లీ సీటు, అంతకు ముందు వచ్చిన ఓట్లను కూడా పోగొట్టుకుంది. ఏ రాష్ర్టంలోనూ సిఎం అభ్యర్థిని ప్రకటించటం తమ విధానం కాదని చెప్పుకొనే బిజెపి అక్కడ మెట్రో మాన్ శ్రీధరన్ను ప్రకటించింది. తనకేమీ రాజకీయాల్లేవంటూనే 2016లో కేరళలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ఆహ్వాన సంఘానికి అధ్యక్షురాలిగా పని చేశారు. ఆ మరుసటి ఏడాది ఉష అథ్లెటిక్ స్కూలులో సింథటిక్ ట్రాక్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిం చారు. ఆ తరువాత రైతులు తిరస్కరించి ఏడాది పాటు ఆందోళన సాగించిన మోడీ మూడు సాగు చట్టాలను ఆమె సమర్ధించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారంటూ గ్రేటా థన్‌బెర్గ్, గాయని రిహానాను ఖండించారు. వీటికి ప్రతిఫలంగా ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కింది.
ఇంతకూ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను బిజెపిని కాపాడుతున్నదా లేక ఆ పార్టీనే అతను ఒక ప్రాంతంలోనైనా శాసించే స్థితిలో ఉన్నారా? ఉత్తరప్రదేశ్‌లోని గోండా ప్రాంతంలో ఒకనాటి రౌడీ షీటర్, ఇప్పటికీ హత్యాయత్నం, కొట్లాట, దోపిడీ వంటి 40 క్రిమినల్ కేసులున్నప్పటి కీ గాంగ్‌స్టర్లను ఏరిపారవేస్తానన్న యోగి పాలనలో ఆ జాబితాలో ఇతగాడి పేరు లేదు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా దేశం కోసం, ఉత్తరప్రదేశ్ ఉన్నతి కోసం ఎప్పుడూ సాధు, సంతులతో కలసి తిరిగే బిజెపి గాంగ్‌స్టర్లు వేరయా అని లోకానికి సందేశమిచ్చారు. ఎందుకంటే అరవైఆరు సంవత్సరాల ఈ పెద్ద మనిషి స్వయంగా మల్లయోధుడు, ఒకసారి ఎస్‌పి, ఐదుసార్లు బిజెపి ఎంపిగా ఉన్నారు. అదనపు అర్హతలు ఏమంటే పేరుమోసిన హిందూత్వవాది, బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న కర సేవకుడనని స్వయంగా చెప్పుకున్నా రు.

ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్‌లతో సంబంధాల గురించి చెప్పనవసరం లేదు. ఆ ప్రాంతం లో “శక్తిశాలి” అని అనుచరులు ఆకాశానికి ఎత్తుతారు. ఎందుకు అంటే కెమేరాల సాక్షిగా అతిక్ అహమ్మద్ అనే గూండా సోదరులను కాల్చి చంపిన ఆ పుణ్య గడ్డ మీదే తన స్నేహితుడిని చంపిన హంతకుడి మీద కాల్పులు జరిపి హతమార్చినట్లు కెమెరాల ముందే ప్రకటించిన బ్రిజ్ తీరు ఉత్తర ప్రదేశ్‌లోగాక మరెక్కడ జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి తరఫున పోటీకి దిగినపుడు నాలుగుసార్లు ఎంపిగా ఉన్న కాంగ్రెస్ నేత ఆనంద సింగ్ మీద పోటీ వద్దని నాటి జిల్లా పోలీసు అధికారి తన కార్యాలయానికి పిలిపించుకొని అడగ్గా తీవ్ర వాదోపవాదాల్లో భాగంగా తన దగ్గర ఉన్న తుపాకిని తీసి ఎస్‌పి మీద గురి పెట్టగా వెనక్కు తగ్గిన తరువాత తాను వెనక్కు వెళ్లినట్లు స్వయంగా మీడియాతో చెప్పారు. అంతేనా ముంబై డాన్ అరుణ్ గావ్లీ అనుచ రుడిని చంపినట్లు ఆరోపణలున్న దావూద్ ఇబ్రహీం అనుచరులు సుభాష్ ఠాకూర్, జయేంద్ర ఠాకూర్, ప్రకాష్ దేశాయిలతో చేతు లు కలిపినందుకు టాడా చట్టం కింద అనేక నెలలు తీహార్ జైల్లో ఉన్న హిందూ ముస్లిం జాతీయవాది, గాంగస్టర్ల ఐక్యతావాది. ఇలాంటి వారి మీద కేసులకు పట్టే గతి తెలిసిందే. ఎవరైనా ముందుకు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పి బతగ్గలరా?
మహిళా రెజ్లర్లు తమపై జరుగుతున్న వేధింపుల మీద గళమెత్తారు. కొన్ని ఉదాహరణలను చూస్తే జాతి వివక్ష వంటి అంశాల మీద నిరసన తెలిపిన ప్రపంచ స్థాయి క్రీడాకారులు, అథ్లెట్ల గురించి పిటి ఉషకు తెలియకుండా ఉంటుందా? లేకపోతే మాట్లాడే ముందు తెలుసుకోవాలి. 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో రెండు వందల మీటర్ల పరుగు పందెంలో గోల్డ్, సిల్వర్ పతకాలను సాధించిన అమెరికా టోమీ స్మిత్, జాన్ కార్లోస్ జాతి వివక్షకు నిరసనగా కాళ్లకు బూట్లు లేకుండా, చేతులకు నల్లటి గ్లౌజులు వేసుకొని పోడియం మీదకు ఎక్కారు. 2016లో ఫుట్‌బాల్ క్రీడాకారుడు కోలిన్ కయిపెర్నిక్ ఉదంతం తెలిసిందే. అమెరికాలో కొనసాగుతున్న జాతి వివక్ష, నల్ల జాతీయుల మీద జరుగుతున్న పోలీసు దాడులకు నిరసనగా క్రీడలకు ముందు రిపే జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడకుండా మోకాళ్ల మీద నిలిచి నిరసన తెలిపాడు.

ఒకసారి కాదు అనేక సార్లు అదే చేశాడు. దాంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరసన తెలిపే క్రీడాకారులను లంజకొడుకులని నోరు పారవేసుకున్నాడు. 2020లో జార్జి ఫ్లాయడ్ అనే నల్లజాతి యువకుడిని పోలీసులు చంపినపుడు అమెరికా అంతటా తీవ్ర నిరసన వెల్లడైంది. అనేక మంది క్రీడాకారులు దానిలో పాల్గొన్నారు. క్రమశిక్షణ పేరుతో మౌనంగా ఉండలేదు. ప్రపంచ ఫుట్‌బాల్ సంస్థ పీఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో వాటి మీద స్పందిస్తూ నిరసన తెలిపిన క్రీడాకారులను అభినందించాలి తప్ప శిక్షించకూడదన్నాడు. తోటి మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులు జరుగుతుంటే పిటి ఉష గొంతెత్తి వారి పక్షాన నిలవాల్సింది పోయి నోరు మూసుకొని భరించమనే సందేశం ఇవ్వటం,

దానికి క్రమ శిక్షణ అని ముసుగు తొడగటం స్త్రీ జాతికే అవమానం. నిరసించే ధైర్యం లేకపోతే అవమానాలను దిగుమింగుతూ ఆత్మ గౌరవాన్ని చంపుకొని చచ్చిన చేపల్లా వాలునబడి కొట్టుకుపోతూ, మౌనంగా ఉంటున్న అనేక మంది మాదిరే ఉంటే అదొక తీరు. తోటి క్రీడాకారులు రోడ్డెక్కితే అనేక మంది ప్రముఖ క్రీడాకారులు వారికి బాసటగా నిలిచారు. అనేక మంది మౌనంగా ఉన్నారు. ఈ రోజు వేధింపులు రెజ్లర్ల మీద జరగవచ్చు. వాటి పట్ల మౌనంగా ఉంటే రేపు తమ దాకా వస్తే అని ఆలోచించి ఉంటే ఈ పాటికే ఢిల్లీ పోలీసుల మీద వత్తిడి పెరిగి సుప్రీంకోర్టు వరకు పోకుండా కేసులు నమోదు చేసేవారు. క్రీడాకారుల మౌనం ఎంతో ప్రమాదకరం. సుప్రీంకోర్టును సంతుష్టీక రించేందుకు కేసులు నమోదు చేసినా తరువాత జరిగే వాటి గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News