న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో గ్యాస్ పైపులతో కలకలం సృష్టించిన దుండగులకు పాస్‌లు వెలువరించిన మైసూరు ఎంపి తమ వివరణ ఇచ్చారు. గురువారం ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకున్నారు. నిందితులలో ఒకరి తండ్రి తనను కలిసినట్లు, విజిటర్స్ పాస్ కోసం అడిగినట్లు స్పీకర్‌కు తెలియచేసుకున్నారు. ఈ ఎంపి పాస్ తీసుకునే దుండగులు బుధవారం లోక్‌సభలో విపరీత చర్యకు దిగారు. ఈ నేపథ్యంలో పాస్ ఇచ్చిన మైసూరు బిజెపి ఎంపి ప్రతాప్ సింహాను కూడా భద్రతా అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతాప్ సింహా స్పీకర్‌ను కలిసి తమ వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది.
కొత్త పార్లమెంట్ భవనం చూడాలని తన కుమారుడు ఆసక్తితో ఉన్నారని, ఎంపి పాస్ ఇస్తే వెళ్లి చూస్తాడని తండ్రి తనను కోరారని ఎంపి తెలిపారు. దీని తరువాత కుమారుడు, విద్యాధికుడు , ఇప్పుడు నిందితుడు అయిన సాగర్ శర్మ తరచూ ఈ ఎంపి పిఎంతో మాట్లాడుతూ ఏదో విధంగా పాస్ సంపాదించుకున్నట్లు తనకు ఇప్పుడు అర్థం అయిందని మైసూరు ఎంపి తెలిపారు. తనకు ఈ విషయంలో దీనికి మించి ఏమీ తెలియదని, దీనినే ఇంతకు ముందు కూడా ప్రకటించానని వివరించుకున్నారు.