బిజెపిలో దళితులు ఎదగలేరు
ఆ అవకాశాలు కూడా వాళ్లకు రావు
యెడియూరప్ప కుమారుడు కాబట్టే విజయేంద్రకు పదవి
బిజెపి ఎంపి రమేష్ జగజినగి సంచలన వ్యాఖ్యలు
బెంగళూర్ : కర్ణాటక మాజీ సిఎం బిఎస్ యెడియూరప్ప కుమారుడు బివై విజయేంద్రను రాష్ట్ర బిజెపి చీఫ్‌గా నియమించడం పట్ల ఆ పార్టీ ఎంపి రమేష్ జగజినగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీఫ్‌గా విజయేంద్ర నియామకం పట్ల హైకమాండ్ తీరును ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో పార్టీ నేతలను పక్కనపెట్టి విజయేంద్రకు కీలక పదవి కట్టబెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విజయపురలో రమేష్ విలేకరులతో మాట్లాడుతూ బిజెపిలో దళితులు ఎదగలేరని అన్నారు. మీరు దళితులైతే బిజెపిలో ఎదిగేందుకు మీకు ఎలాంటి అవకాశాలు రావని వ్యాఖ్యానించారు. డబ్బున్న ఇతర నేతలు లేదా గౌడల (వొక్కలిగలు)కు పార్టీలో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.
దళితులకు మాత్రం ఎవరూ మద్దతుగా నిలవరని, ఈ విషయం తమకు తెలుసని, పార్టీలో ఈ పరిస్థితి విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. యెడియూరప్ప కుమారుడు అయినందునే విజయేంద్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని ఆరోపించారు. కాగా, నళిన్ కుమార్ కతీల్ స్ధానంలో కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, షికారిపుర శాసనసభ్యుడైన విజయేంద్ర బుధవారంనాడు కర్ణాటక బిజెపి చీఫ్ బాధ్యతలను అధికారికంగా స్వీకరించనున్నారు.