పార్లమెంట్‌లో సిఎం కెసిఆర్‌పై బురద జల్లేందుకు విఫలయత్నం
బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కేంద్రం నుంచి కాదు, లేదు అనే సమాధానాలే దూసుకొచ్చాయి
కాళేశ్వరం వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సమాచారం ఇచ్చిందని కేంద్రం వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్‌లో రాష్ట్ర బిజెపి ఎంపిలు తలాతోక లేకుండా ప్రశ్నలు అడిగి పరువు పొగొట్టుకున్నారు. వారు అడిగిన ప్రశ్నల విధానాన్ని చూస్తుంటే ముందస్తూ కసరత్తు చేయకుండానే సమావేశాలకు హజరువుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదో మొక్కుబడిగా ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై బురద చల్లడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న ఆ పార్టీలు ఎంపిలు పార్లమెంట్ సాక్షిగా పరాభవం పాలయ్యారు. దేశం యావత్తు చూసే పార్లమెంట్ సమావేశాల్లో మన రాష్ట్ర పక్షాన సంధించే ప్రశ్నలు తెలంగాణకు మేలు జరిగే విధంగా ఉండాలే తప్పా…. రాష్ట్రాభివృద్ధికి అడ్డుతగిలేలా ఉండొద్దు. కానీ బిజెపి ఎంపిలు తెలంగాణకు మేలు జరగాలన్న ఆకాంక్ష కంటే రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఉడికిపోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగేందుకు పార్లమెంట్ సమావేశాలను వినియోగించుకోవాలని భారీ పథకం వేసుకున్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు ఆస్కారం కలిగించే విధంగా పలు రకాల ప్రశ్నలు సంధించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వారి అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి మద్దతు లభించే విధంగా సమాధానం ఇవ్వకపోవడం విశేషం. పైగా తెలంగాణ ప్రభుత్వం అన్ని విషయాలలో కేంద్రానికి సమగ్ర సమాచారాన్ని అందించే నిర్ణయాలు తీసుకుందని వెల్లడించింది. దీంతో సభలో ప్రశ్నలు సంధించిన మన బిజెపి ఎంపిలు తెల్లమోహం వేసుకోవాల్సి వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన సమాధానం చూసి విస్తూపోవాల్సి వచ్చింది. దీనికి మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాలు ప్రత్యక్ష తార్కాణం.
సమావేశాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాఖ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం గురించి, ప్రాజెక్ట్ పనుల షెడ్యూల్ గురించి, రాష్ట్రానికి వచ్చిన 14, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల గురించి ప్రశ్నించారు. దీనిపై కేంద్రంపై స్పందించి కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం పెంపు గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తి సమాచారం ఇచ్చిందని వెల్లడించింది. అలాగే స్టీలు, సిమెంట్‌తో పాటు ఇతరత్ర ధరలతో పాటు జిఎస్‌టి తదితర కారణాల వలన ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందని కేంద్రానికి సమగ్రమైన సమాచారం ఇచ్చిందని స్పష్టం చేసింది. అలాగే నీటి ప్రాజెక్టులు పూర్తిగా రాష్ట్రాల అవసరాల మేరకు నిర్ణయాలు జరుగుతాయని పేర్కొన్నది. ఈ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులతోనే నిర్మిస్తాయని అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఇక తెలంగాణకు వచ్చిన 14,15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల గురించి బండి సంజయ్ ప్రశ్నకు కేంద్రం నుంచి వచ్చిన సమాధానం కూడా చాలా సూపర్‌గా ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట ప్రభుత్వాలకు అధికారికంగా వచ్చే నిధులపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని లిఖితపూర్వక సమాధానం కేంద్ర ఆర్థికశాఖ సమాధానమిచ్చింది.
అలాగే మరో ఎంపి ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నలు కూడా ఆ పార్టీ పరువు తీసే విధంగా ఉండడం విశేషం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రిపోర్టులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇతర పనులకు మళ్ళించింది అన్న ఆరోపణ చేసిన మాట వాస్తవమేనా? అలాగే మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ (ఎంజిఎన్‌జిఆర్‌ఇఎస్) నిధులను ఖర్చుపెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతుందా? అని ధర్మపురి ప్రశ్నించారు. ఈ రెండు ప్రశ్నలకు సమాధానంగా ‘ కాదు ..లేదు‘ అని సమగ్ర వివరాలతో సహా సంబంధిత మంత్రిత్వ శాఖలు సమాధానం ఇచ్చాయి. రాష్ట్రానికి కేంద్రం నుండి రావలసిన నిధుల కోసంగానీ, తెలంగాణ నీటి హక్కుల కోసం, కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కోసం ఏనాడూ ఒక్క మాటైనా పార్లమెంట్‌లో ప్రస్తావించని ఈ ఎంపిల తీరుపై రాష్ట్ర ప్రజలు తీవ్ర విస్మయానికి లోనవుతున్నారు.