Monday, January 20, 2025

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.. పార్లమెంట్ లో రచ్చ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ గత వారం లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో రాజకీయ దుమారాన్ని లేపాయి. రాహుల్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో అధికార పక్ష ఎంపిలు డిమాండ్ చేశారు. అయితే దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి అధికార పక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారంటూ విపక్ష నేతలు విమర్శించారు. అదానీగ్రూపు సంక్షోభంపై సంయుక్త పార్లమెంటు కమిటీ(జెపిసి) చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. లోక్‌సభ సభ్యుడైన రాహుల్ గాంధీ లండన్‌లో అవమానించారని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను సభలోని సభ్యులందరూ తీవ్రంగా ఖండించాలని, దేశానికి కాంగ్రెస్ నేత క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడడానికి ముందే అధికార ఎన్‌డిఎ సభ్యులు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు కూడా దీటుగా అధికార సభ్యుల తీరుకు నిరసన తెలియజేస్తూ వెల్‌లోకి దూసుకువచ్చి తమ నిరసన తెలియజేశారు.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ సమయంలో ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కి వేసినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. అలాగే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ కాపీని రాహుల్ గాంధీ చించేసినప్పుడు ప్రజాస్వాం ఎక్కడికి పోయిందన్నారు. రాహుల్ గాంధీ స్పీకర్‌ను కూడా నిందించారని, అయినా ఆయన మైక్రోఫోన్ ఆన్‌లోనే ఉందని, ఆయన స్వేచ్ఛగా సభలో మాట్లాడారని జోషీ గుర్తు చేశారు. ఈ దశలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, ఇంకా బలపడుతోందని అన్నారు. అధికార, విపక్ష సభ్యుల నినాదాలు కొనసాగుతుండడంతో స్పీకర్ తొలుత సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేవారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ..

మరో వైపు రాజ్యసభలోనూ రాహుల్ గాంధీ అంశంపై ప్రకంపనలు చెలరేగాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని సీనియర్ నేత అవమానించడం సిగ్గుచేటన్నారు. గోయల్ వ్యాఖ్యలకు పలువురు బిజెపి మంత్రులు కూడా మద్దతు పలికారు. అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు గతంలో నరేంద్ర మోడీ కూడా విదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని గుర్తు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇరు పక్షాల గొడవతో చైర్మన్ ధన్‌కర్ సభను భోజన విరామం దాకా వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పీయూష్ గోయల్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సభ్యులంతా ఖండించాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే గోయల్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు.

సభలో సభ్యుడు కాని వ్యక్తిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడగటం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే, నాశనం చేసే వారే దాన్ని రక్షించాలంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక సభలో సభ్యుడు, మరో సభలో సభ్యుడికి వ్యతిరేకంగా మాట్లాడరాదంటూ గతంలో పెద్దల సభ చైర్మన్లు ఇచ్చిన రూలింగ్‌లను ఖర్గే గుర్తు చేస్తూ గోయల్ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అధికార పక్షసభ్యులు సభ జరగకుండా అడ్డుకోవడం తన 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అంటూ సభ సాఫీగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారపక్షానికి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలపై చైర్మన్ ధన్‌కర్ స్పందిస్తూ, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను తాను గమనించానని, అయితే గోయల్ తాను ఎవరి పేరునూ ప్రస్తావించలేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేయడంతో ఇరు పక్షాల సభ్యులు మళ్లీ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో దీనిపై మంగళవారం రూలింగ్ ఇస్తానని చెప్తూ సభను వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News