Saturday, November 23, 2024

వచ్చెడివాడు ఫల్గుణుడు

- Advertisement -
- Advertisement -

BJP mukt bharat

రాబోయే రోజుల్లో భారతదేశం నుంచి బిజెపిని తరిమేయడం ఒక్కటే నేడు ప్రజల ముందు ఉన్న అతి ముఖ్యమైన కర్తవ్యం. వ్యవస్థలను భ్రష్టు పట్టించడం, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను, నాయకులను వేటాడడం ఒక ఎత్తైతే- యే హిందూ ప్రజలనైతే రామరాజ్యం తెస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చి వారికే నేడు చుక్కలు చూపిస్తున్నరో… ఆ బిజెపిని ఇండియన్, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, సదరన్ మహా సముద్రాలలో దేనిలో ఒకదానిలో కలిపేయవలసిన అవసరం ఉన్నది. పంచ మహా పాతకాల బిజెపిని ముంచడానికి పంచమహా సముద్రాలే సబబు!

జెండా బట్ట, జెండా కర్ర తమంత తాముగా ఉద్వేగం రగిలించలేవు. దానికో దిమ్మ అవసరం. ఎగరేయడం అవసరం. అన్నిటికీ మించి సందర్భం అవసరం. అట్లాగే బిజెపి ముక్త భారత్ సాధనకు అత్యంత కీలకమైన ముడిపదార్థం ప్రజలే అయినప్పటికీ వారి ఆకాంక్షల్ని అస్త్రాలుగా చేసి, ఎన్నికల రణరంగాన ఎక్కుపెట్టి, మెజారిటీ ఎంపిలతో పార్లమెంటులో అడుగు పెట్టేలా చేసేది రాజకీయ నాయకత్వమే. గల్లీలో పోరునూ, ఢిల్లీలో రాజనీతిని (రాజకీయం కాదు, రాజనీతే!) సమ్మిళితమూ సమన్వయమూ చేయగలిగే విలక్షణ నాయకుడి అవసరం నేడు ఉన్నది. ఆ అవసరం ఆ నాయకుడి కంటే, దేశానికి ఎక్కువ ఉన్నది.

ఉత్తర గోగ్రహణ సందర్భాన రాజకుమారుడు ప్రాణముల్ ఠావుల్ దప్పి పారిపోతూ వుంటే, ధైర్యం చెప్పి, నేనున్నానని, నీకేం కాదని, శమీవృక్షం నుంచి దించిన గాండీవ ధనుష్ఠంకారంతో విజయుడు చెలగిపోతూ వుంటే- వచ్చినవాడు ఫల్గుణుడు అంటూ కురువృద్ధులు అభిమానాస్పదంగా పద్యాలు పాడడం తెలుసు మనకు. శత్రు శిబిరాల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం ఉత్తమ పురుషులకే చెల్లు.

ఈ పోలిక ఎందుకంటే, రానున్న విజయదశమికి బిజెపి ముక్త భారత్ ధనుష్ఠంకారం తెలంగాణ గడ్డనుంచే మార్మోగబోతున్నది.ఆవులు మలిపినవాడే అర్జునుడు… ఆవు పేరు చెప్పి దుష్ట రాజకీయాలు చేసేవారి పొగరును అదుపు చేసేవాడే కాలం కనబోతున్న ఆ జాతీయ నాయకుడు. ఆయనే కెసిఆర్! కేవలం రాజకీయ నాయకుల వ్యూహాలు, ప్రణాళికలు, వాగ్దానాలు మాత్రమే ప్రజలను ఆకర్షింపజేయవు. నాయకుల పోరాట పటిమ, గతంలో వారి విజయగాథలు అందులో కీలకం. ఇవన్నీ కెసిఆర్ దగ్గర పుష్కలంగా ఉన్నయి. స్వరాష్టం సాధించడమే కాదు; స్వపరిపాలన, సుపరిపాలన యెట్లా ఉంటదో చూపించి దేశంలోనే తన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి – ఇదిగో రేపు దేశాన్ని కూడా ఇదే రీతి ప్రగతి బాటల పరుగులు తీయిస్తా అంటున్నరు ఆయన. కాదనడానికి ఎవరి దగ్గర మాత్రం ఏం వాదన ఉందని?!

మరొక ముఖ్యమైన విషయం ఏమంటే భావోద్వేగాల తర్వాత ప్రజలు అంతగా స్పందించేది తమ ఆర్ధిక జీవనం అల్లకల్లోలం అయినప్పుడు! సరిగ్గా ఇక్కడే కెసిఆర్ స్కోర్ చేయగలుగుతరు. అక్కడక్కడా బిజెపి మతపిచ్చి అంటూ మాట్లాడినా, బిజెపి విధానాల వల్ల ప్రజలు పడుతున్న కష్టాల గురించే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నరు ఆయన. ఇటీవలి అన్ని బహిరంగ సభలలో కెసిఆర్ మాట్లాడినది అంతా విధానపర అంశాలే. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రూపాయి పతనం, నలభై ఏళ్ళలో ఎప్పుడూ లేని నిరుద్యోగిత, లక్షల కోట్ల అప్పులు, రికార్డు స్థాయిలో గ్యాస్ ధర పెంపు, ప్రజల నిత్యావసర వస్తువులు కూడా జిఎస్‌టిలో చేర్చడం -ఇత్యాది ప్రజాసంబంధిత అంశాలే ఆయన మాట్లాడుతున్నరు.

పొలాల్లో పచ్చని పంటలా, కాల్వలలో ఎర్రెర్రని మంటలా -ఏది కావాలో తేల్చుకోండి అని ప్రజలను ఆలోచింపజేస్తున్నరు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ మరే ఇతర ఇతర రాష్ట్రం కంటే కూడా, ముఖ్యంగా బిజెపి పాలనలోని 19 రాష్ట్రాల కంటే కూడా అగ్రగామిగా ఉన్నదని సాధికారంగా చెపుతున్నరు కెసిఆర్. డేటా సహితంగా మాత్రమే కాదు -తమపై ఇంతగా దాడి చేసే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల, సంస్థల, ఆర్‌బిఐ లాంటి వాటి ప్రశంసా పత్రాలను చూపి మరీ తమ అభివృద్ధి- సంక్షేమ అజెండాను నొక్కి చెపుతున్నరు.

ఆయన ప్రయత్నాలకు, అందులోని చిత్తశుద్దికి తెలంగాణ వాళ్ళు, తెలుగువాళ్లు మద్దతు ఇవ్వడం చకితులను చేసే విషయం కాదుగానీ, 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతాంగ ప్రతినిధులు ఆయన ‘దేశ్ కీ నేతా’ అని నినదించడం నిశ్చయంగా సంభ్రమాశ్చర్యమే. దేశంలోని పలు ప్రభుత్వాధినేతలు, జాతీయ స్థాయి నాయకులు కెసిఆర్ కేంద్రిత చర్చల్లో ఉండడం మనకు గర్వకారణమే. జాతీయ మీడియా కెసిఆర్ చుట్టూ మూగడం ఒక విజయ సంకేతమే. దళిత బంధు రూపేణా దళితుల సాధికారతను కొత్తపుంత తొక్కిస్తున్న కెసిఆర్‌కు దేశవ్యాప్త దళితుల నుంచే కాదు, బహుజనుల నుంచి కూడా మద్దతు లభిస్తున్నది.

ఒక వైపు ఉర్రూతలూపు కవనాలు
ఒకవైపు ఉరికించు యుద్ధ భేరీలు
నవరసా లొలికించు నగరాని కొచ్చాము
… అంటూ విజయనగరాధీశుని వైభవాన్ని వర్ణిస్తారు ఆచార్య ఆత్రేయ. సరిగ్గా అట్లనే కెసిఆర్ ఒకవైపు కళలు, సాహిత్యం, ఆధ్యాత్మిక సంపదను పెంచుతూనే; మరోచెంప అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం, అంతర్జాతీయ స్థాయి ప్రణాళికలు, గుణాత్మకమార్పు గురించి కృషి చేస్తున్నరు. ఆయనను దగ్గరగా చూసినవారు నేడు యే శిబిరంలో ఉన్నా, దేశంలోనే విలక్షణ నాయకుడు కెసిఆర్ అని మర్మగర్భంగానైనా ఒప్పుకోక వుండరు.

Bandi Sanjay Arrest in Jangaon

బండి సంజయ్ మూక నానాయాగీ చేసినా, ‘ప్రభుత్వ కృషి వల్ల గణేష్ నిమజ్జనం నిరాఘాటంగా సాగుతున్నది. ఏర్పాట్లు చాలా బాగున్నవి, హిందువులు అందరూ ఆనందంగా ఉన్నరు’ అన్నరు ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు. ఇంతకంటే ఇంకేమి సర్టిఫికేట్ కావాలి?! రంజాన్ పవిత్ర మాసం మొత్తమూ ముస్లింలు ఆధ్యాత్మిక భావనతో పండుగ జరుపుకోవడం పట్ల మోల్వీలు, మౌజంలు సహా రాజకీయ పార్టీల నాయకులూ ప్రశంసలు గుప్పించడం ఏమి తెలియజేస్తున్నది? ప్రపంచంలోనే అయిదవ ఆర్ధికశక్తి అయిన భారత్… మతపర విషయాల్లో దిగజారిన ప్రతిష్ఠను పునరుద్ధరించడానికి ఇంతకంటే మేలైన గంగా- జమునా పుత్రుడు దొరుకుతడా?! కెసిఆర్ నికార్సయిన హిందువు. రాముడు, కృష్ణుడి ఫిలాసఫీ ఏమిటో తెలియని బిజెపి నాయకులు కూడా కాదని అనడానికి సాహసించరు! ‘కెసిఆర్ సర్వమత, సర్వసమతా స్వాప్నికుడు. దేశంలోని యే హైందవ, క్రైస్తవ, ఇస్లాం ప్రతినిధులను అడిగినా లిప్తపాటు ఆలోచన లేకుండా ఒప్పుకుంటరు, అవునని! ‘కెసిఆర్ అభివృద్ధి- సంక్షేమం -ఆత్మగౌరవ విధానాలతో జనరంజక పాలన చేయగలరు. ఇందుకు కావలసిన ఉదాహరణలు యే కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖను అడిగినా గణాంకాల సహితంగా నిజమని చెప్తరు. మరింకేమి కావాలి దేశానికి? మరెందుకు ఆలస్యం? రండి, నడుద్దాం ఆయనతో. సరైన సమయం ఇదే.
జై హింద్!

-శ్రీశైల్ రెడ్డి పంజుగుల
9030997371

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News