Friday, November 22, 2024

మన్మోహన్‌కు బిజెపి క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి)లో నిట్టనిలువు చీలిక అనంతరం ప్రత్యర్థ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో చేరిన 8 నెలల అనంతరం ఆ పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్‌కు సంబంధించిన అవినీతి కేసులో సిబిఐ క్టీన్ చిట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం అనంతరం ఏర్పాటు చేసిన నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విమానాలను లీజుకు ఇవ్వడంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపిన సిబిఐ తన ముగింపు నివేదికను గురువారం సమర్పించింది. ఈ కేసులో మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదంటూ సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. మోడీ వాషింగ్ విషన్: 8 నెలల క్రితం నరేంద్ర మోడీతో ప్రఫుల్ పటేల్ చేతులు కలిపారు. ఆయనపై అవినీతి కేసును సిబిఐ మూసివేసింది అంటూ వారిద్దరి ఫోటోతో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చురకలు అంటించింది. ఇదే వివాదంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) కూడా తీవ్రంగా స్పందించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బిజెపి క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ ఎంపి సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో పౌర విమానయాన రంగంలో అవినీతి జరిగినట్లు బిజెపి అరచి పెడబొబ్బలు పెట్టిందని, కాని ఎటువంటి అవినీతి జరగలేదని సిబిఐ దర్యాప్తు ముగింపు నివేదికను ఇచ్చిందని, అందుకు మన్మోహన్ సింగ్‌కు బిజెపి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండు చేశారు. కాగా..కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐలను బిజెపి రాజకీయమయం చేయడం సిగ్గుచేటని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. రానున్న ఎన్నికలలో దీనిపై ప్రజలు సమాధానమివ్వాలని ఆప్ పిలుపునిచ్చింది. గత దశాబ్ద కాలంగా బిజెపి అతి పెద్ద రాజకీయ వాషింగ్ విషన్‌ను నిర్వహిస్తోందని ఆప్ అధికార ప్రతినిధి జాస్మిన్ షా ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు, వ్యాపారులను అందులో వేస్తే ఎన్నికల విరాళాలు, అబద్ధాలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి, ఎన్‌సిపి(అజిత్ పవార్ గ్రూపు) నాయకుడు ప్రఫుల్ పటేల్‌కు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు.

ప్రఫుల్ పటేల్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు రూ. 840 కోట్ల అవినీతి జరిగిందని సిబిఐ చార్జిషీట్‌లో పేర్కొందని, ఆయనకు సమన్ల మీద సమన్లు పంపడంతోపాటు ఆయన ఆస్తులను 2023 జులై వరకు జప్తు కూడా చేశారని ఆప్ ప్రతినిధి తెలిపారు. అజిత్ పవార్ గ్రూపు మహారాష్ట్రలో బిజెపి కూటమిలో చేరిన తర్వాత పరిస్థితి మారిపోయిందని, ఇప్పుడు ఆయనకు ఈ అవినీతి కేసులో సిబిఐ క్లీన్ చిట్ కూడా ఇచ్చేసిందని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News