Thursday, January 23, 2025

వివక్ష బిజెపి డిఎన్‌ఎలోనే ఉందా?

- Advertisement -
- Advertisement -

BJP prepares for lone battle in Manipur

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల… మూడు సార్లు ఇచ్చినట్లే ఇచ్చి పక్క రాష్ట్రాలకు తరలించడమే కాకుండా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ ఏడేండ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ కేంద్రం ఈసారి బడ్జెట్‌లో కూడా ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో నిరూపితం అయింది. నిజాం కాలంలో నిర్మింపబడిన (1874-1889) కాజీపేట రైల్వేస్టేషన్ ఆనాడు ప్రయాణికులతో, కార్మికులతో కిటకిటలాడేది. 150 ఏండ్ల చరిత్ర గల కాజీపేట రైల్వే స్టేషన్‌కు డివిజన్‌కాగల అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నేటికీ జంక్షన్‌గానే మిగిలిపోయింది. ఇప్పటికే మూడుసార్లు తెలంగాణలోని కాజీపేటలో కోచ్ పరిశ్రమ నిర్మాణం కోసం కేంద్రం అనుమతులు ఇచ్చినట్లే ఇచ్చి పక్క రాష్ట్రాలకు తరిలించింది. 1982 సం.లో కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయగా అనాడు ఇందిరా గాంధీ మరణం, సిక్కుల ఊచకోత వారిని శాంతిపజేసేందుకు తరువాత అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పంజాబ్‌లో పేట్రేగిపోతున్న ఉగ్రవాదం, నిరుద్యోగం లాంటి తదితర అంశాలను చూపి పంజాబ్‌లోని కపూర్తలకు 1985 వ సంవత్సరంలో తరలించారు.

అనంతరం మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలికి 2010 లో మలుపుకపోయింది. ఇక కోచ్ ఫ్యాక్టరీ విషయంలో సహించేది లేదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో పునర్విభజన చట్టంలో కోట్లాడి మరి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పలు అంశాలను పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ హామీని పునర్విభజన చట్టంలో 13వ షెడ్యూల్ 10వ అంశంగా తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని ప్రత్యేక అంశంగా చేర్చింది. కానీ ఆ విభజన హామీ అంశం పట్ల కేంద్రం మాట మార్చింది. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలలోపే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చట్టం చెపుతున్నప్పటికీ అట్టి విషయాన్ని విస్మరిస్తుంది. తెలంగాణకు కేటాయించాల్సిన పరిశ్రమను గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రలోని లాతూర్ (625 కోట్ల 350 ఎకరాల్లో ఏర్పాటు చేసింది)కు తరలించి తెలంగాణకు తీరని అన్యాయాన్ని మిగిల్చింది. ఈ విషయంపై ప్రశ్నిస్తే స్థల సేకరణ చేయలేదని కుంటిసాకులు చెప్తున్నారు. అంతేకాకుండా పలు రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్షతను చూపుతూనే ఉంది. 2011లో వ్యాగన్ షెడ్డును మొదట సికింద్రాబాద్ డివిజన్ కు కేటాయించిన కేంద్రం అక్కడ స్థల సేకరణ జాప్యం అవ్వడం వల్ల ఆ ప్రాజెక్టును కాజీపేటకు తరలించి ఆనాడు రాష్ట్ర సర్కారు స్థల సేకరణ చేయకపోగా ప్రాజెక్టు రద్దయింది. 2016లో 500 కోట్ల అంచనా వ్యయంతో వ్యాగన్ పిరియడికల్ ఓవరాలింగ్ పెడ్డును మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం 152 ఎకరాల స్థల సేకరణ చేసి రైల్వే అధికాలకు అప్పగించింది. పలు నూతన రైల్వే లైన్ల కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపితే కుంటిసాకులు చెబుతూ, మంజూరు చేయలేదు. మంజరైన లైన్లకోసం నిధులు కేటాయించకుండా ప్రతీకార చర్యలకు పూనుకుంటున్నది. ఈసారి బడ్జెట్‌లో పైన నిధులు కేటాయిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణకు మొండి చెయ్యి చూపించింది..

కోచ్ పరిశ్రమపై రవికుమార్ అనే సామాజికవేత్త సమాచార హక్కు చట్టం 2005 ద్వారా సమాచారం కొరగా స్పందించిన కేంద్రం తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని భవిష్యత్‌లో కూడా ఆ అవసరం లేదని సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా విభజన హామీల పట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పీయూష్ గోయల్ మాట్లాడారు. హామీలు ఇచ్చిన వారిని అడగాలని బాధ్యత రహిత్యంగా వ్యాఖ్యానించారు. దేశంలో అవసరమైనన్ని కోచ్‌లు తయారు చేయగల పరిశ్రమలు ఇప్పటికే ఉన్నాయని ఇంకా పరిశ్రమల అవసరం లేదని పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాన్ని అవహేళన చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసింది బిజెపి. అటు ఈ ప్రకటన చేస్తూనే మహారాష్ట్రకు చడిచప్పుడు లేకుండా కోచ్ ఫ్యాక్టరీని తరిలించింది. దక్షిణాది వాళ్ళు కోరుకుంటారు, ఉద్యమిస్తారు. కానీ ఉత్తరాది వాళ్ళకు అడక్కుండానే ఇస్తారు. ఇలా కేంద్రంలోని బిజెపి తెలంగాణ రాష్ట్రంపై తన అక్కసును వెళ్లబోస్తుంది.

విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, ఐటిఐఆర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే వస్తుంది. కోచ్ పరిశ్రమతో పాటు, కాజీపేట రైల్వే స్టేషన్‌ను డివిజన్‌గా చూడడం తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష. చాలా న్యాయ సమ్మతమైన, సహేతుకమైన డిమాండ్. అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు. అన్ని రకాల అవకాశాలు, అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటికి ఇంకా జంక్షన్‌గానే కొనసాగిస్తున్నారు. కాజీపేటను వదిలిపెట్టి అవసరంలేని, అర్హతలులేని స్టేషన్లను డివినన్‌గా మార్చారు

( ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో అతి కొద్ది దూరంలోనే ఉన్న విజయవాడ, గుంటూరులను డివిజన్లుగా మార్చారు) సౌత్ సెంట్రల్ రైల్వేలో దాదాపు 50 శాతం ఆదాయం కాజీపేట జంక్షన్ నుండే ఉంటుంది. ఇతర అన్ని జంక్షన్ల కంటే ఎక్కువ సంఖ్యలో (12,000 మంది) ఉద్యోగులు ఉన్నారు. 18,000 విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. ప్రతిపాదిత కాజీపేట డివిజన్ పరిధిలో మూడు జంక్షన్లు ఉన్నాయి. అధికారికంగా పెద్దపల్లి, డోర్నకల్, కారెపల్లి… అనధికారికంగా మానిగర్, జగ్గయ్యపేట జంక్షన్లు ఉన్నాయి. మొత్తం 83 స్టేషన్లు ఈ ప్రతిపాదిత డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఈ డివిజన్ పరిధి హైదరాబాద్ రైల్వే మార్గంలో పెంబర్తి స్టేషన్ వరకు, విజయవాడ మార్గంలో కొండపల్లి స్టేషన్ వరకు, భద్రాచలం మార్గంలో మణుగూర్ వరకు, ఢిల్లీ మార్గంలో మానిగర్ వరకు పరిధి ఉండేలా డివిజన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర సర్కారుకు బహుశా అవి అర్హతలుగా కనిపించడం లేదేమో..!

కోచ్ పరిశ్రమను తెలంగాణకు కేటాయించాల్సిన అవసరం ఉన్నప్పటికీ తన మొండి వైఖరిని ప్రదర్శించింది. కాజీపేటలో రైల్వే వ్యవస్థపై ఆధారపడి లక్షలాది మంది బతుకుతున్నారు. వారి బతుకులను మెరుగుపరచడానికి ఆ ప్రాంతానికి కోచ్ పరిశ్రమ అత్యంత అవసరం. కోచ్ పరిశ్రమ కాజీపేటలో ఏర్పాటు చేస్తే రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది. వరంగల్ ప్రాంతంలో రైల్వే అనుబంధ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కోచ్ పరిశ్రమ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాంపూర్, మడికొండ ప్రాంతాల్లో 2000 ఎకరాల భూమిని సేకరించి అందించేందుకు సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినటు వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో బిజెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముగ్గురు పార్లమెంట్ సభ్యులు విభజన హక్కులపై వింతగా మాట్లాడుతూ తెలంగాణ పట్ల వివక్షత బిజెపి డిఎన్‌ఎలోనే ఉందా అన్న చందంగా వ్యవహరిస్తూ విభజన హామీలను సాధించడంలో విఫలం అవుతూనే ఉన్నారు.. రాజ్యాంగబద్ధంగా ఆనాడు పార్లమెంట్ సాక్షిగా బిజెపి మద్దతుతోనే ఆమోదింపబడిన విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత కేంద్రంలోని బిజెపిపై ఉన్నప్పటికీ ఈసారి బడ్జెట్లో విభజన హామీలకు నిధులు కేటాయించకపోవడం కేంద్రం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లే.

సాధ్యాసాధ్యాలని మాట్లాడుతున్నా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఒక విషయాన్ని ఎలా విస్మరిస్తున్నారు? ఒక రాష్ట్ర, ఒక ప్రాంత హక్కులపై అలా మాట్లాడడం మీకు, మీ పార్టీకి తెలంగాణ మీద ఉన్న చిత్తశుద్ధిని నిరూపించారు. మూడుసార్లు నోటి కాడీ బుక్కను ఎత్తుకెళ్లి ఏడేండ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ఈసారి కూడా బడ్జెట్‌లో కోచ్ పరిశ్రమ ఊసే ఎత్తకుండా తెలంగాణ ప్రజానీకం ఆశలపై నీళ్లు చల్లారు. చట్టబద్ధంగా సంభవించిన మా ప్రాంత ప్రయోజనాన్ని కాలరాయడం చాలా అన్యాయం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే ముఖ్యంగా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60 వేల మందికి ఉద్యోగాల కల్పనతో పాటు పరోక్షంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడి శ్రమ జీవుల స్థితిగతులు మెరుగుపడుతాయి. పట్టణంలోని వాణిజ్య, వ్యాపార అభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేయగలదు. కాబట్టి తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నప్పటికీ తమాషా చేస్తున్నది. విభజన హక్కుల కోసం పోరాడాల్సిన పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు పర్యాటకుడిగానే వ్యవహరించారు. బడ్జెట్‌లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను తీసుకురావడంలో విఫలమయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కేవలం ఉత్తరాది ప్రభుత్వమే అని మరోసారి రుజువైంది.

నరేంద్ర మోడీ ప్రభుత్వం పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ జాతికి తీరని అన్యాయ చేస్తోంది. సంస్థలను జాతికి అంకితం చేసిన ప్రభుత్వాలను చూశాం కానీ ఇలా లాభాల్లో నడుస్తున్న సంస్థలను నష్టాల సాకుతో ప్రైవేటుపరం చేస్తున్న ఏకైక ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా బిజెపి చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. లాభాలతో నడిచే పలు రైల్వేస్టేషన్లను, రైల్వే మార్గాలను ప్రైవేటుపరం చేసేందుకు పూనుకుంది. ఇప్పటికే దేశంలో అవసరంలేని మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులు, ప్రజాగ్రహానికిలోనై ఇటీవల పార్లమెంట్ సాక్షిగా వెనక్కి తీసుకుని రాబోయే తమ ఓటమిని తామే ఒప్పుకున్నారు. ఈసారి బడ్జెట్‌లో రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ పరిశ్రమ, విభజన హామీలను విస్మరించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనుమరుగు కాకతప్పదు. ఉత్తరాది రాష్ట్రాల కోసమే అన్నట్లు మరి ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు కేంద్రం తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టింది. కోచ్ ఫ్యాక్టరీ సాధనకై కాజీపేట ప్రాంత ప్రజలు ఉద్యమించారు. గత కొన్ని నెలలుగా రైల్వే జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో యువత, వ్యాపారస్థులు, విశ్రాంత ఉద్యోగులు, పలు యూనియన్ల నాయకులు పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నప్పటికి కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం చాలా బాధాకరం. పార్టీల జెండాలను పక్కన పెట్టి తమ ప్రాంత ప్రయోజన కోసం కలిసొచ్చే పార్టీలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ కోచ్ ఫ్యాక్టరీ సాధనకై కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, టిడిపి, ప్రజా సంఘాలను కలుపుకుని ఢిల్లీ సర్కారుపై పోరు చేసి తమ హక్కులను సాధిస్తామని మంగళవారం నాడు హైదరాబాద్ రైల్ నిలయం ముట్టడితో తేల్చి చెప్పారు. దశాబ్దాల కాజీపేట కోచ్ పరిశ్రమ, డివిజన్ అంశాన్ని, పలు విభజన హామీలను నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీకి పుట్టగతులుండవు.

పిన్నింటి
విజయ్ కుమార్
9052039109

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News