న్యూఢిల్లీ : తీహార్ జైలులో తానున్న సమయంలో తనకు ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ నేను జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నానని బీజేపీకి అర్థమైంది. నా భార్య అనారోగ్యంగా ఉందని, కుమారుడు చదువుకుంటున్నాడని తెలుసు. అప్పుడు వాళ్లు నాకు ఓ అల్టిమేటమ్ ఇచ్చారు. ‘ అరవింద్ కేజ్రీవాల్‌ను వదిలేయ్. లేదా జైల్లోనే మగ్గిపో’ అని చెప్పారు. నేను బీజేపీలో చేరితే ఆప్ ఎమ్‌ఎల్‌ఎల కూటమిని విచ్ఛిన్న చేస్తామని చెప్పారు.
నన్ను ముఖ్యమంత్రిని చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్‌కు అంగీకరించక పోతే సుదీర్ఘకాలం జైల్లోనే ఉండేలా చేస్తామని బీజేపీ బెదిరించింది” అని సిసోడియా ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ ఇదే వారి విధానం. ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తారు. బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష నేతలను లక్షంగా చేసుకుంటారు. వారు మాట వినకపోతే తప్పుడు కేసులతో జైలుకు పంపిస్తారు. స్కూళ్లు, ఆస్పత్రులు, ప్రజల అవసరాలతో వాళ్లకు పట్టింపు లేదు. కేవలం అధికారం కోసమే ఆరాటపడుతారు. ” అని సిసోడియా దుయ్యబట్టారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో సిసోడియా 2023లో అరెస్టయిన సంగతి తెలిసిందే.న దాదాపు 17 నెలల పాటు కస్టడీలో ఉన్న ఆయనకు గత ఏడాది ఆగస్టులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో జాంగ్‌పురా నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.