Sunday, November 3, 2024

బీజేపీలో చేరితే రూ.20 కోట్లు.. చేర్పిస్తే రూ.25 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సిబిఐ జరిపిన దాడులతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆప్ ఆరోపించింది. అందుకోసం డబ్బు, దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోందని మండిపడింది. బీజేపీ తీరును నిరసిస్తూ ఐదుగురు ఆప్ నేతలు మీడియా ఎదుటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆప్ ప్రతినిధి రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. “ఢిల్లీ ప్రభుత్వంలోని ఎమ్‌ఎల్‌ఎలను లాక్కొనే ప్రక్రియ ప్రారంభమైంది. మనీశ్ సిసోడియాపై ‘షిండే’ మంత్రం ప్రయోగించారు.. కానీ విఫలమయ్యారు. ఆప్ ఎమ్‌ఎల్‌ఎలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్‌దీప్ కుమార్‌లను బీజేపీ నేతలు సంప్రదించారు. పార్టీలో చేరితే రూ.20 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. వారితోపాటు ఇంకెవరికైనా చేర్పిస్తే, రూ.25 కోట్లు ఇస్తామని బేరం తెచ్చారు.

ఈ ఆఫర్ తీసుకోండి లేకపోతే సీబీఐ కేసుల్ని ఎదుర్కోండని చెప్పారు” అంటూ సింగ్ ఆరోపించారు. ‘సిసోడియాపై పెట్టిన కేసులు నకిలీవని తెలుసని వారు చెప్పారు. కానీ బీజేపీ సీనియర్ నేతలు ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయాలని నిర్ణయించుకున్నారు. ఆప్ నేతలను చేర్చుకునే బాధ్యతను స్థానిక బీజేపీ నేతలకు ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ఢిల్లీ ప్రభుత్వాన్ని పడదోస్తామని ఓ బీజేపీ నేత చెప్పారు. ’అని సోమనాథ్ భారతి వెల్లడించారు. అయితే ఇది ఢిల్లీ అని, ఇక్కడ మిగతా రాష్ట్రాల్లోలా కుదరదని వ్యాఖ్యానించారు. దీనినపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆప్‌ను వీడేందుకు గత కొద్ది రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని, మా ఎమ్‌ఎల్‌ఎలు చెప్పారు. ఇది చాలా తీవ్రమైన అంశం. దీనిపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహిస్తున్నాం. అని వెల్లడించారు. కాగా, ఈ ఆరోపణలను బీజేపీ కొట్టి పారేసింది.

BJP offered rs 20 crore to AAP MLAs: Sanjay Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News