Sunday, January 19, 2025

బెంగాల్ నైతిక ధర్మాలకు బిజెపి వ్యతిరేకం : అభిషేక్ బెనర్జీ

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్ నైతిక ధర్మాలను బీజేపీ వ్యతిరేకిస్తోందని అందువల్ల ఆ పార్టీని ప్రజలు వ్యతిరేకించాలని టిఎంసి సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ శనివారం ఆరోపించారు. బీర్‌భూమ్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జాబ్ కార్డులున్న పేదలకు వందరోజుల వేతనాన్ని మోడీ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని ఆయన గుర్తు చేశారు. బెంగాల్‌లో స్వామీ వివేకానంద, వంటి అత్యంత గౌరవప్రదమైన కీర్తిశాలురను గుర్తించడం లేదని, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ప్రతిమను ధ్వంసం చేశారని, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ లోనే పుట్టారని వారికి తెలియదని, వారిచే నియామకమైన వారు అమర్తసేన్ వంటి ప్రఖ్యాత ఆర్థికవేత్తల ఆత్మాభిమానాన్ని తరిమివేయడానికి ప్రయత్నిస్తున్నారని అభిషేక్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి గ్రామీణ ఉపాథి పథకం నిధులు ఎంత విడుదల చేశారో వివరాలు తెలియజేస్తూ శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో చేపట్టే గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఒక్కపైసా కూడా విడుదల కావడం లేదని ఆరోపించారు. మోడీ తమ పదేళ్ల పాలన చిత్రాన్ని ప్రజలు చూస్తున్నారని చెబుతున్నారని, కానీ ఆయన ఖాతాలో ఇంక ఎన్ని అబద్ధాలు నిల్వ ఉన్నాయో ఆశ్యర్యం కలుగుతోందని విమర్శించారు. “2014 కు ముందు ప్రతి ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 400 ఉండగా, ఇప్పుడు రూ. 1000 మార్కు దాటింది. అలాంటి అచ్ఛేదిన్ లక్షణాలను ఆ ట్రయిలర్ చూపించగలిగితే , నిజమైన చిత్రం ఏం చూపిస్తుందో భగవంతుడికి తెలుసు” అని వ్యాఖ్యానించారు. “ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కన్యశ్రీ, రూపశ్రీ, లక్ష్మీర్ భాండార్ వంటి ప్రాజెక్టులను రూపొందించగా, ప్రతివారి బ్యాంకు అకౌంట్‌లో రూ. 15 లక్షల జమ వంటి మోడీ హామీలు ఇంకా అమలు కాకుండా మిగిలే ఉన్నాయి ” అని అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News