Wednesday, January 22, 2025

పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి బిజెపి శంఖారావం

- Advertisement -
- Advertisement -

ఈ నెల 4,5 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన
ఆదిలాబాద్, పటాన్‌చెరులో బహిరంగ సభలు
తమ పాలనలో ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ శంఖం పూరించనున్నారు. ఈనెల 4, 5 తేదీల్లో తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈ పర్యటనలో ఆదిలాబాద్, పటాన్ చెరు వేదికగా రూ. 15,718 కోట్ల విలువ గల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నట్లు వెల్లడించారు.

మార్చి 4వ తేదీన ఉ.9 గం.లకు ఆదిలాబాద్ స్టేడియంలో జరిగే విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు వికసిత్ భారత్ లక్ష్యాల గురించి ప్రజలకు వివరిస్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న విజయ సంకల్ప బహిరంగ సభల్లో రాష్ట్ర నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పాల్గొననున్నారు.

అదేవిధంగా మార్చి 5 వ తేదీన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పటేల్ గూడలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కాలేజీ వేదికగా జరిగే విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటారు. లోక్ సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశాన్ని ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి, బహిరంగ సభలను విజయవంతం చేయాలని, బిజెపికి అపూర్వ మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News