ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు భిన్నమైన పార్టీ తమది అంటూ వాజపేయి, ఎల్ కె అద్వానీ గర్వం గా చెప్పుకొనేవారు. 1984లో ఇందిరా గాంధీ హత్యా అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సానుభూతి ఉప్పెనలో రెండు సీట్లకు పరిమితమైనప్పటికీ ఆ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఏమాత్రం మనోనిబ్బరాన్ని కోల్పోలేదు.
కానీ నేడు పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి. వామపక్షాల కంచుకోటగా సుదీర్ఘకాలం పేరొందిన పశ్చిమ బెంగాల్ లో సిపిఎంను నాలుగో స్థానానికి నెట్టివేయడంతో పాటు, మొదటి స్థానం కోసం వీరోచితంగా పోరాడుతున్నారు. మరో వామపక్ష కోటగా పేరొందిన కేరళలో పాగా వేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కంచుకోట త్రిపురను ఆక్రమించుకున్నారు. కేవలం హిందుత్వ వ్యతిరేక విధానాలతో అర్ధ శతాబ్దికి పైగా తమిళనాడు రాజకీయాలు ఆధిపత్యం వహించగా, ఇప్పుడు ఆ రాష్ట్రంలో సొంతంగా బలం పెంచుకోలేకపోయినా అధికార పార్టీని తమ గుప్పెట్లో ఉంచుకొని, ఆడించగలుగుతున్నారు.
ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాల ప్రకారం నేడు దేశంలోని జాతీయ పార్టీలకు గల ఆస్తులలో 54 శాతానికి పైగా బిజెపికి ఉన్నాయి. అంటే బిజెపి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కావడమే కాకుండా, పెద్ద సంపన్న పార్టీగా కూడా మారింది. నేడు ప్రజాకర్షణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పోటీపడ గల నేత లేరు. ఎన్నికల ఎత్తుగడలతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు సాటిరాగల నాయకుడు లేరు. అయినప్పటికీ ఆ పార్టీ అంతర్గతంగా అసహన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నది.
ప్రజాబలంతో కాకుండా ఇతర పార్టీల నుండి అడ్డదిడ్డంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా, కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి బలమైన రాజకీయ ప్రత్యర్థులను దారికి తెచ్చుకోవడం ద్వారా రాజకీయ ఆధిపత్యం కోసం బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీ భవిష్యత్‌ను ప్రశ్నార్ధకరం కావించే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. బిజెపి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పశ్చిమ బెంగాల్‌లో ‘మేమెప్పుడూ బిజెపిలో చేరాం?’ అంటూ ఇద్దరు అభ్యర్థులు విస్మయం వ్యక్తం చేయడం ఆ పార్టీ నాయకత్వ స్థాయిని వెల్లడి చేస్తున్నది.
బెంగాల్‌లో ఒక వంక అధికారం కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుండగా దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన వారి నుండి తీవ్రమైన నిరసనలు ఎదుర్కొంటున్నది. వీధులలోకి వచ్చి, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తూ వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడ ‘సువెందు బిజెపి’, ‘పాత బిజెపి’ అంటూ రెండు కూటములుగా చీలిపోయిన్నట్లు కనిపిస్తున్నది. కేరళలో సహితం పరిస్థితులు అంతకన్నా భిన్నంగా లేవు. గత ఎన్నికలలో మొదటిసారిగా ఒక అసెంబ్లీ సీటును గెల్చుకొనే వరకు అక్కడ చట్టసభలలో ప్రవేశింపలేకపోయినా అక్కడ బిజెపి సైద్ధాంతికంగా, రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఉండెడిది.
కానీ పార్టీలో అర్ధ శతాబ్దికాలం పాటు కీలకంగా వ్యవహరించిన నాయకులను పక్కన పెట్టడం కోసం 75 ఏళ్ళు నిండిన వారికి పార్టీలో, ప్రభుత్వంలో స్థానం లేదంటూ ఒక నియమాన్ని ఎటువంటి చర్చ అంతర్గతంగా జరపకుండానే అమలు చేస్తూ వస్తున్న నాయకత్వం కేరళలో ‘మెట్రో మాన్’ శ్రీధరన్ (87)ను అభ్యర్థిగా ఎన్నికల గోదాలోకి దింపడం ఆ పార్టీ నాయకత్వం ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో వెల్లడి చేస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలోని సైద్ధాంతిక వార పత్రిక ఆర్గనైజర్ సంపాదకుడిగా పనిచేసి, తర్వాత బిజెపి కేంద్ర కార్యాలయంలో పలు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన బాలశంకర్ అమిత్ షా సూచనతో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం కోసం గత కొద్దీ నెలలుగా కేరళలో ఒక నియోజకవర్గంపై దృష్టి సారిస్తూ వచ్చారు.
అయితే తీరా సీట్ ఇవ్వకపోవడంతో రాష్ట్ర బిజెపి నాయకత్వం సిపిఎంతో కుమ్మక్కై తనకు సీట్ ఇవ్వలేదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రెండు స్థానాలలో పోటీ చేస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె సురేంద్రన్ తాను ఒక సీటులో గెలవడం కోసం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో అవగాహనకు వచ్చాడని కూడా తీవ్రమైన ఆరోపణ చేశారు. గతంలో రాజ్యసభ సభ్యునిగా కూడా పని చేసిన పార్టీ సీనియర్ నేత, గత ఎన్నికలలో అసెంబ్లీకి ఎన్నికైన ఓ రాజగోపాలన్‌ను బాలశంకర్ చేసిన ఆరోపణల గురించి ఒక పాత్రికేయుడు ప్రస్తావించగా ‘కాంగ్రెస్, ముస్లిం లీగ్‌లతో చాలా కాలంగా అవగాహనతో బిజెపి పని చేస్తున్నది, సిపిఎంతో కాదు’ అంటూ మరో బాంబు పేల్చారు. కేరళలో బిజెపిని తాము రాజకీయంగా ఒక ప్రత్యర్థిగా భావించడం లేదని ఈ మధ్యనే ముస్లిం లీగ్ అధినేత ఒకరు పేర్కొనడం గమనార్హం.
ఇక తమిళనాడులో పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న డిఎంకెను అధికారంలోకి రాకుండా చేయడం కోసం క్రుంగిపోవడానికి సిద్ధంగా ఉన్న అన్నాడిఎంకె ప్రభుత్వంపై ప్రాణం పోస్తూ వస్తున్నది. 20 సీట్లు మించి తమకు ఇవ్వకపోయినా సర్దుకొంది. పైగా, జైలు నుండి వచ్చిన శశికళను తిరిగి అన్నాడిఎంకెలోకి తీసుకురావడం కోసం, కనీసం ఎన్నికల పొత్తు పెట్టుకొనే విధంగా చేయడం కోసం విఫలయత్నం చేసింది.
అవేమీ సాధ్యం కాకపోవడంతో ఎన్నికలయ్యే వరకు రాజకీయాలకు దూరంగా ఉండేటట్లు శశికళను చేయగలిగారు. రాజకీయంగా తమ బలాన్ని పెంచుకొనే ప్రయత్నం చేయలేక పోతున్నారు. బిజెపి నిస్సహాయ స్థితిని అవకాశంగా అన్నాడిఎంకె నేతలు ఉపయోగించుకొంటున్నారు. పాండిచ్చేరిలో అయితే స్థానికంగా ప్రాబల్యం గల ఒక పార్టీతో పొత్తు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని అర్ధాంతరంగా మార్చవలసి వచ్చింది. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో సహితం పార్టీలో నెలకొన్న కుమ్ములాటలను పరిష్కరింపలేకపోతున్నారు. ఇవ్వన్నీ పార్టీ ఎదుర్కొంటున్న నాయకత్వ సంక్షోభాన్ని వెల్లడి చేస్తున్నది.
తమిళనాడు నుండి ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్ధిక, విదేశాంగ వ్యవహారాల శాఖలు నిర్వహిస్తున్నారు. కానీ ఓటర్లపై ఏమాత్రం వారు ప్రభావం చూపే అవకాశం లేదు. కర్ణాటకలో యడ్యూరప్ప, ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ తప్ప బిజెపి ముఖ్యమంత్రులు, రాష్ట్ర స్థాయి నేతలు ఎవ్వరూ ఓటర్లపై ఎటువంటి ప్రభావం చూపే పరిస్థితులలో లేరు. కేంద్ర మంత్రివర్గం సహితం దాదాపు అదే విధంగా ఉంది. ఎన్నికల సమయంలో మూడు వారాలుగా పెట్రోల్ ధరలు పెంచకుండా జాగ్రత్తపడటం, రాజకీయ ప్రత్యర్థులపై ఆదాయ పన్ను, ఇడి వంటి కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు దాడులు జరుపుతూ ఉండడం గమనిస్తే ఏడేళ్లుగా కేంద్రంలో సాగించిన పాలనతో ప్రజాబలం తమవెంట ఉన్నదనే భరోసా కొరవడినట్లు భావించవలసి వస్తున్నది.