Saturday, November 2, 2024

పార్లమెంటు ఎన్నికలకు కమలం కసరత్తు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు పోరుకు కసరత్తు వేగం చేశారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుంటంతో ముందస్తు ప్రచారానికి సిద్దమైతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో పాటు ఓటింగ్‌శాతం పెరగడంతో అదే ఊపులో మరోసారి ప్రజల వద్దకు వెళ్లేందుకు ఆపార్టీ సీనియర్లు వ్యుహాలు రచిస్తున్నారు. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర నాయకత్వంతో సమావేశం నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలను శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసమావేశంలో మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం, మున్సిపాలిటీల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటారని తెలిపారు. వారితో అసెంబ్లీలో ఎన్నికల్లో ఊహించిన దానికంటే సీట్లు ఎందుకు తగ్గాయి కారణాలు విశ్లేషించి భవిష్యత్తు ఎన్నికలకు మార్గదర్శకాలు చేస్తారని ఆపార్టీ పెద్దలు వెల్లడిస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా నాలుగు ఎంపి సీట్లు గెలుచుకుని బిఆర్‌ఎస్ తరువాత బిజెపి రెండోస్ధానంలో నిలిచింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక గోషామహల్ గెలిచిన పార్లమెంటు సీట్ల విషయంలో ప్రజలు ఆదరించారని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడంతో పార్లమెంటు స్దానాలు గతం కంటే ఎక్కువ గెలవచ్చనే ధీమాలో కమలనాథులు 8 నుంచి 10 సీట్లలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు దీటుగా ఎన్నికలో బరిలో పోరాడేందుకు అస్త్రాలు సిద్దం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో మోడీ, అమిత్‌షా నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం కొలువుదీరేందుకు శ్రేణులంతా మూడు నెలల పాటు శ్రమించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. 10 ఏళ్ల కాలంలో బిజెపి సర్కార్ ప్రవేశ పెట్టిన పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రచారం చేపట్టాలని హైకమాండ్ పేర్కొంటున్నట్లు ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 30వేల ఓట్లు సాధించిన నేతలకు పార్లమెంటు అభ్యర్ధిగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది.

మల్కాజిగిరి నుంచి పోటీకి చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బిజెపి మధ్యప్రదేశ్ ఇంచార్జీ మురళీధర్‌రావు సిద్దమైతున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ నుంచి బిసి సామాజిక వర్గానికి చెందిన తల్లోజు ఆచారి, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మెదక్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు ప్రకటించగా, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా పార్టీ ఆదేశిస్తే సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. భువనగిరి నుంచి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, గూడురు నారాయణరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. చేవెళ్ల నుంచి మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యోగానంద్ తామే పోటీ చేస్తామని అనుచరులతో పలుమార్లు జరిగిన సమావేశంలో తెలిపారు.

హైదరాబాద్ నుంచి భగవంత్‌రావు, రాజాసింగ్ బరిలో నిలుస్తున్నట్లు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్య వహిస్తున్న సోయం బాపురావు మరోసారి రేసులో ఉంటారని, నిజామాబాద్ ఎంపి స్దానం నుంచి ధర్మపురి అర్వింద్‌కుమార్, కరీంనగర్ నుంచి బండి సంజయ్‌కుమార్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు పార్టీ పెద్దలు వెల్లడిస్తున్నారు. గ్రేటర్‌లోని సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పోటీ చేసి మరోసారి కేంద్ర మంత్రివర్గంలో కొలువుదీరుతారని పార్టీ నాయకత్వం అంచనా వేస్తుంది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్దానాల్లో ఏపార్టీతో పొత్తు లేకుండా అన్ని స్ధానాల్లో పోటీ చేస్తామని, బలమైన నియోజకవర్గాల్లో ప్రజాబలమున్న నేతలను ఎంపిక చేసి విజయం సాధిస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News