Monday, December 23, 2024

రాష్ట్ర వ్యాప్తంగా 40 బహిరంగ సభలు : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నేతలతో 40 బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పధాధికారులు, సీనియర్ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే వేలకోట్ల రూపాయల నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల దృష్ట్యా ప్రధాని రెండు రోజుల రాష్ట్ర పర్యటించనున్నారని వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్‌లో, 3వ తేదీన నిజామాబాద్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభలకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించేలా… 30 నుంచి 40 సభలు నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించిందన్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో బిజెపి అధికారంలోకి రాగానే ప్రజలకు ఏం చేయనుంది అనే అంశాలపై ప్రజలకు తెలియజేసేందుకే బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబరు 6వ తేదీన బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆ రోజున జరిగే విస్తృత స్థాయి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతారని వెల్లడించారు. ఈ సమావేశంలో బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్‌రావు, తమిళనాడు రాష్ట్ర సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్, విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు , ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News