Sunday, January 19, 2025

మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్ర: సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆపరేషన్ కమల పేరిట బిజెపి కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. బిజెపి కుట్రలు ఫలించే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపి ప్రలోభాలకు లొంగబోరని ఆయన స్పష్టం చేశారు.

2019లో కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన బృందమే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల నగదు, మంత్రి పదవిని ఆశచూపుతున్నాయంటూ మాండ్య నుంచి మొదటిసారి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ(రవి గనిగ) చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఇప్పటికే ఆ బృందం సంప్రదించిందని, ఇందుకు సంబంధించిన వీడియోలను తాను త్వరలోనే బయటపెడతానని రవికుమార్ ప్రకటించారు.

దినిపై సిద్దరామయ్య స్పందిస్తూ తాను రవికుమార్‌తో ఇప్పటివరకు మాట్లాడలేదని, అయితే తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆపరేషన్ కమల పేరిట బిజెపి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. ఆపరేషన్ కమల వలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిక్కుకోబోరని, బిజెపి పన్నాగాలు సాగబోవని ఆయన స్పష్టం చేశారు.

కాగా..కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి జరుగుతున్న కార్యకలాపాలలో మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప మాజీ పిఎ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జెడిఎస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన వ్యక్తి ఉన్నారంటూ కూడా రవికుమార్ ఆరోపించారు.

ఇలా ఉండగా రవికుమార్ ఆరోపణలపై డిప్యుటీ ముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా స్పందించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక పగడ్బందీ వ్యూహాన్ని బిజెపి రచిస్తోందని, అయితే అది ఫలించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి ప్రవర్తన తమకు తెలుసునని, రవికుమార్ ఒక యువ నాయకుడి పేరు చెప్పారని, కాని ఇందులో పెద్ద తలకాయలు కూడా ఉన్నాయని, వారి కుట్రలు ఫలించబోవని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News