Wednesday, January 22, 2025

ప్రజలతో బిజెపి కపటనాటకాలు

- Advertisement -
- Advertisement -

BJP Political drama

ప్రజాస్వామ్యంలో ప్రజలను ప్రభుత్వాలను అనుసంధానం చేసేది పరస్పర నమ్మకమొక్కటే కావాలి. తాము చేపట్టిన అధికార దండం గాని, చలాయించే అధికారం గాని ప్రజలిచ్చినవే గాని, తమ సొంతం కావనే ఎరుకతో పాలకులు వ్యవహరించాలి. వారు తీసుకొనే నిర్ణయాల్లో అది ప్రతిబింబించాలి. కాని ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా నడుస్తున్నది. ఎన్నికల సమయంలో ప్రజలు కోరనివి కూడా వాగ్దానం చేసి, ప్రభుత్వంలో ఉన్న వారైతే చార్జీలు, పన్నులు భారీగా తగ్గించి వారిని ప్రసన్నం చేసుకోడానికి చేయని ప్రయత్నాలుండవు. దేవునికి మొక్కుకొనే మొక్కులు కూడా వీటి ముందు బలాదూరే. ఎన్నికలు ముగిసి అధికారంలోకి రావడంతోనే ప్రజల పట్ల పాలకుల వైఖరిలో పూర్తి మార్పు చోటు చేసుకొంటుంది. వారి నిర్ణయాల్లో ప్రాథమ్యాలు మారిపోతాయి, ప్రజా హితం అదృశ్యమైపోతుంది. తమకు ఎన్నికల ఖర్చుకు నిధులు సమకూర్చిన కార్పొరేట్ వ్యాపార శక్తుల ప్రయోజనాలే పాలకులకు శిరోధార్యమవుతాయి. మళ్లీ ఎన్నికలొచ్చేంత వరకూ ఇదే తంతు నడుస్తుంది. ప్రజలు తమ సమస్యలపై అరిచి గీపెట్టుకొన్నా వినేనాథులుండరు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగవలసి వుంది. కరోనా మూడో కెరటం ముంచుకు వస్తున్నందున ఈ ఎన్నికలను వాయిదా వేయాలన్న హితవచనం వొకవైపు నుంచి వినవస్తున్నప్పటికీ, వాటిని సకాలంలోనే జరిపించాలని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సంఘాన్ని కోరినట్టు వార్తలు వచ్చాయి.

గత ఏడాది కొవిడ్ ప్రజల ప్రాణాలను కొరుక్కుతింటున్న సమయంలోనే బీహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలు జరిపించిన సంగతి తెలిసిందే. అందుచేత యుపి మున్నగు అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును ఈ నెల 10-13 తేదీల మధ్య ఎన్నికల సంఘం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యం వోటి మల్లయ్యలను మళ్ళీ ఓటు మల్లయ్యలను చేసింది. పాలకులకు ప్రజల అవసరాన్నిపెంచింది. సూటిగా చెప్పాలంటే వారికి ఓటర్ల అవసరం బాగా కలిగింది.

ముఖ్యంగా దేశాన్నేలుతున్న బిజెపికి ఓటర్లను విశేషంగా ఆకట్టుకోవలసిన అక్కర మిగతా అన్ని పార్టీల కంటే అమితంగా ఏర్పడింది. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించుకోవాలంటే 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ బిజెపికి కీలకమవుతుం ది. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించుకోడం దానికి ఎంతో అవసరం. ప్రధాని మోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకొంటున్న కొన్ని కీలక నిర్ణయాలు ఈ ఎన్నికల దృష్టితోనే వెలువడుతున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల సమూల రద్దును కోరుతూ చెప్పనలవికాని చలికి, ఎండకు తట్టుకొని దేశ రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు నిప్పుల మీద నిరంతర నడక మాదిరి మహోద్యమం నడిపినప్పుడు దానిని అణచివేయడానికి తన దగ్గరున్న శక్తులన్నింటినీ ప్రయోగించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఊహించని విధంగా అగస్మాత్తుగా మనసు మార్చుకొని అత్యంత అయిష్టంగానే ఆ మూడు చట్టాలను రద్దు చేసింది యుపి ఎన్నికల భయంతోనేనన్నది సుస్పష్టం.

అప్పటికీ రైతు ఆందోళన పూర్తిగా సద్దుమణగకపోడంతో ఆ చట్టాలను మళ్లీ తెస్తాం సుమా అని బెదిరించిన కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ నాలుక్కరుచుకొని సారీ చెప్పింది కూడా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనేనన్నది కాదనలేని వాస్తవం. తాజాగా యుపిలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం రైతుల విద్యుత్ చార్జీలను సగానికి సగం తగ్గించి వేసింది. ఇదీ రైతు ఓటర్ల మద్దతు కూడగట్టుకొనేందుకేనంటే కాదనగల దమ్ము ఎవరికీ ఉండదు. అసంఖ్యాక మగ్గాలు మూతపడి నిరుపేద చేనేత కార్మికుల నడ్డివిరిగి, బతుకులు బండలయి వారు మరింతగా ఆత్మహత్యలను ఆశ్రయించవలసిన దుస్థితిని సృష్టించే వొక తీవ్ర నిర్ణయాన్ని గత సెప్టెంబర్‌లో తీసుకొన్న కేంద్రం దానిని వాయిదా వేసుకొంటున్నట్టు ఇప్పుడు ప్రకటించడంలోని ఆంతర్యాన్ని విప్పి చెప్పనక్కర లేదు.

నూలుపై వస్తు, సేవల (జిఎస్‌టి ) పన్నును 5% నుంచి 12% కి పెంచాలని గత సెప్టెంబర్‌లో జిఎస్‌టి మండలి తీసుకొన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకొంటున్నట్టు ఆ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో నిర్ణయించిం దని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. లేకపోయివుంటే ఈ భారం ఈ జనవరి వొకటి నుంచే విరుచుకుపడి ఉండేది. ఈ పన్నును 5% వద్దనే కొనసాగించాలని చేనేత కార్మికులు విశేషంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వొత్తిడి కల్పించినా పెడచెవిన పెట్టిన కేంద్రంలోని బిజెపి పాలకులు ఎన్నికల్లో ఓటమి భయంతోనే వాయిదా వేశారు, కాని రద్దు చేసుకోలేదు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత మళ్లీ ఈ చేదు నిర్ణయాలన్నీ బుట్టలోని పాముల్లా బయటికి వచ్చి ప్రజలను కాటు వేయవనే భరోసా ఉండనక్కర లేదు. ప్రేమతో, నమ్మకంతో వోటేసి అధికార అందలంపై తమను ఆసీనులను చేసిన ప్రజలతో ఇలా కపట నాటకాలాడడం కంటే నీచ రాజకీయం మరొకటి ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News