Wednesday, January 22, 2025

మహా కూటమిలపై బిజెపి దాడి ఇది రెండోసారి

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాదీ (ఎంవిఎ)పై బిజెపి రెండేళ్లలో రెండుసార్లు రాజకీయ సర్జికల్ దాడులకు దిగింది. రాష్ట్రంలో బలీయమైన విపక్ష కూటమి తమ రాజకీయాధికారానికి దెబ్బతీస్తోందని, దీనిని నేరుగా ఎదుర్కోవడం క్లిష్టమని తేలడంతో ఏకతాటిపై ఉండే ఘట్‌బంధన్‌ను చీల్చడం ఇది రెండేళ్లలోరెండోసారి అయింది. ఏడాది క్రితం ఏక్‌నాథ్ షిండే శివసేనలో చీలిక ద్వారా 40 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చారు. షిండేకు బిజెపి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఇప్పుడు ఇక్కడనే ఎన్‌సిపి నుంచి ఈ పార్టీ నేత అజిత్ పవార్ తన మద్దతుదార్లతో వెలుపలికి రావడం , ఉపముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడం హుటాహుటిన జరిగాయి.

ఒక్కరోజు క్రితమే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. ఇటీవలే సిఎం ఏక్‌నాథ్ షిండే ఢిల్లీకి వెళ్లి వచ్చారు. నిజానికి ఎన్‌సిపి ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్ ప్రభుత్వంలో వచ్చి చేరితే తాను బయటకు వెళ్లుతానని ఎప్రిల్‌లోనే ఏక్‌నాథ్ షిండే తెలిపారు. అయితే ఇప్పుడు పవార్ రాకను షిండే స్వాగతించారు. ఇప్పుడు ఓ సిఎం, ఇద్దరు డిప్యూటీ సిఎంలు ఉన్నారని, ఇప్పటివరకూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటూ వచ్చిందని, ఇకపై ఇది మూడు ఇంజిన్ల ప్రభుత్వం అయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్ వంటి సీనియర్ నేత సేవలు అవసరం అన్నారు, ఆయన అపార అనుభవం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లుతుందన్నారు.
ఘట్‌బంధన్‌ను దెబ్బతీయడమే కీలకం
ఎప్పటికైనా తమకు బలీయమైన మహాఘట్‌బంధన్ రాజకీయ సవాలుగానే ఉంటుందని బిజెపి భావించింది. దీనితో కూటమిలో చీలికకు పావులు కదిపింది. సీనియర్ పవార్ ఓ వైపు తన రాజనీతిలో దేశంలో ప్రతిపక్షాల ఐక్యతను ముందుకు తీసుకువెళ్లడం వంటి పరిణామాల నేపథ్యంలోనే అదును చూసుకుని ఇప్పుడు జూనియర్ పవార్ (అజిత్ పవార్)ను తమ వైపు లాక్కున్నారని స్పష్టం అయింది.
బహిష్కరణ వేటు దాటాలంటే
అజిత్‌కు 36 మంది ఎమ్మెల్యేల బలం అవసరం
ఎన్‌సిపిలో చీలిక తరువాత ఇప్పుడు అజిత్ పవార్ బృందంపై అనర్హత వేటు విషయం ప్రస్తావనకు వచ్చింది. తనకు ఎన్‌సిపికి చెందిన మొత్తం 53 మంది ఎమ్మెల్యేలలో 40కి పైగా ఎమ్మెల్యేల బలం ఉందని అజిత్ చెపుతున్నారు. ఇక ఫిరాయింపు చట్టంలోని నిబంధనలు తరువాతి దశలోని అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే అజిత్ పవార్‌కు 36 మందికి పైగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరం. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం శరద్‌పవార్ పార్టీకి చెందిన అందరు రెబెల్ ఎమ్మెల్యేలపై వేటుకు డిమాండ్ చేయవచ్చు. ఇటీవలే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యేలు పార్టీలు మారినప్పుడు ఏం చేయాల్సి ఉంటుందనేది నిర్థిష్ట అంశాలను ప్రస్తావించారు. చీలిక వచ్చినప్పుడు ఏది నిజంగా పార్టీ హక్కులు దక్కించుకున్న వర్గం అనేది రుజువు చేసుకోవల్సి ఉంటుంది.

ఇప్పటికే శివసేనకు సంబంధించి పార్టీ ఎన్నికల గుర్తులు అంతకు ముందు నుంచే ఎమ్మెల్యేలపై అనర్హతల వేటు విషయాలు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. నిజమైన పార్టీ ఏదనేది తేలితేనే ఎన్నికల చిహ్నం నిర్థారణ అవుతుంది. ఈ క్రమంలో అజిత్ పవార్ ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. తనదే నిజమైన ఎన్‌సిపి అని రుజువు చేసుకోవల్సి ఉంటుంది. పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కును పొందాల్సి ఉంటుంది. అప్పటి వరకూ కూడా ఆయన ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యే క్రమంలోనే ఉంటారు. దీనిని తప్పించుకునేందుకు బలం చాటుకోవల్సి ఉంటుంది. అయితే ఒకవేళ అజిత్ పవార్ తనకే ఎన్‌సిపి చెందుతుందని నిరూపించుకున్నా ఇటీవల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుతో వెనువెంటనే ఆయనేదే ఒరిజినల్ ఎన్‌సిపి అని అప్పటికప్పుడు ప్రకటించడానికి వీల్లేదని పదవ షెడ్యూల్ నిర్ధేశిస్తోంది. ఈ క్రమంలో ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఏమి జరుగుతుందనే ప్రశ్న కీలకం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News