బిజెపి కుట్ర రాజకీయాలకు ఇది పరాకాష్ఠ. తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు పాలక పార్టీలో చీలిక తెచ్చి అడ్డదారిలో అధికారం చేజిక్కించుకోడం దానికి బాగా అలవాటైన విద్య. అందుకు భిన్నంగా ఇప్పుడు తాను అధికారంలో వున్న చోట కూడా బలమైన ప్రతిపక్షాన్ని చీల్చడమనే కొత్త కుట్రకు తెర తీసింది. మహారాష్ట్రలో ప్రజల మన్ననలు పొందుతున్న మాజీ పాలక కూటమి ఎంవిఎ (మహావికాస్ అఘాదీ) ను వచ్చే ఎన్నికలకు ముందే బలహీనపరచాలని ఆశించిన బిజెపి తన రహస్య మిత్రుడు అజిత్ పవార్‌ను మరోసారి మంత్రించి తన కుట్రను విజయవంతంగా జరిపించుకొన్నది. సీనియర్ నాయకుడు, బిజెపిని దేశాధికారం నుంచి దింపివేయాలనే దృఢ సంకల్పంతో ఏకమవుతున్న ప్రతిపక్షాల కృషిలో పాలుపంచుకొంటున్న ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను కాదని అజిత్ పవార్ ఇంత మందితో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరడం అసాధారణ పరిణామమే.
ఈ పరిణామంతో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి కావడమే కాకుండా తన వెంటనున్న వారిలో ఎనిమిది మందికి మంత్రి పదవులు కూడా ఇప్పించుకున్నాడు. ఈ దెబ్బతో మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్‌సిపి తన ఉనికినే కోల్పోతుందో లేక ఈ వయసులో (82) కూడా ఆయన పార్టీని బలోపేతం చేసుకోగలుగుతారో వేచిచూడాలి. 2019లో అజిత్ పవార్ బిజెపితో కుమ్మక్కై ఒక రోజు తెల్లవారుజామున రాజ్‌భవన్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, తాను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంచలన ఉదంతం తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వం గట్టిగా రెండు రోజులు కూడా గడవక ముందే అజిత్ పవార్ ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్‌సిపిలో చేరి ఎంవిఎ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు శరద్ పవార్ మాటను గౌరవించి వెనక్కి వచ్చిన అజిత్ పవార్ శివసేనలో తిరుగుబాటుతో ఎంవిఎ ప్రభుత్వం కుప్పకూలిన దగ్గరి నుంచి అధికార వియోగాన్ని భరించలేక ఫడ్నవీస్‌తో మంతనాలు జరుపుతున్నట్టు భావించాలి.
ఈ మధ్య కొంత కాలంగా అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారనే వదంతులు వినవచ్చాయి. 2024 వరకు ఎందుకు, ఇప్పుడైనా ముఖ్యమంత్రిని కాగలను అని కొంత కాలం క్రితం అజిత్ పవార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఆయన మనసు పెట్టి పని చేయలేదని, షిండే ప్రభుత్వంపై సునిశిత బాణాలు ప్రయోగించడంలో విఫలమయ్యాడని కూడా తెలుస్తున్నది. మనసొక చోట మనువొక చోట అన్నట్టు ఆయన వ్యవహరించాడనే విమర్శ వున్నది. ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేనను ఏక్‌నాథ్ షిండే ఏడాది క్రితం చీల్చిన పద్ధతిలోనే ఇప్పుడు అజిత్ పవార్ చేత ఈ కుట్రను బిజెపి జరిపించింది. ఇది దానికి ఎంత వరకు ఉపయోగపడుతుందో గాని కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ జరిపించిన ఒక సర్వే వచ్చే ఎన్నికల్లో ఎంవిఎ కూటమి 38 లోక్‌సభ స్థానాల్లోనూ, 180 అసెంబ్లీ సీట్లలో గెలుస్తుందని చెప్పినట్టు తెలుస్తున్నది.
అలాగే ఏక్‌నాథ్ షిండే కుట్రకు బలైపోయిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకి కూడా ప్రజల మద్దతు బాగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పుణె అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో బిజెపి ఓడిపోయింది. అలాగే శాసన మండలికి అది నిలబెట్టిన అభ్యర్థులు కూడా ఓడిపోయారు. అందుచేత ఈ రకమైన కుట్రలతో ప్రతిపక్షాన్ని నైతికంగా దెబ్బ తీయాలని కమలనాథులు వ్యూహ రచన చేసుకొని అమలు పరుస్తున్నట్టు భావించవలసి వుంది. అయితే ఇంకొక వైపు శరద్ పవారే అజిత్‌ను వెనుక నుంచి ఈ పరిణామం వైపు నెట్టి వుంటారనే ఊహాగానాలు కూడా వినవస్తున్నాయి. 2019లో అజిత్ తిరుగుబాటు చేసి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా దాని వెనుక శరద్ పవార్ హస్తమున్నదనే అభిప్రాయం చోటు చేసుకొన్నది.
దానితో ఆయన బాధపడి అజిత్‌ను తిరిగి వెనక్కు రప్పించి ఎంవిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకొన్నారు. ఈ మధ్య శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, అనుచరులు అడ్డుపడడంతో కొద్ది రోజుల్లోనే తిరిగి ఆ పదవిని చేపట్టారు. అప్పుడు అజిత్ పవార్ ఆయన రాజీనామాను సమర్థిస్తూ మాట్లాడారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు శరద్ పవార్ ఏమి చేయబోతున్నారు, మరి కొద్ది రోజుల్లో మహారాష్ట్ర రాజకీయ తెర మీద ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడడం సహజం. గురుపూర్ణమి అయిన ఆదివారం నాడు శరద్ పవార్‌ను తన ముఖ్య శిష్యులైన ప్రఫుల్ పటేల్, చగన్ భుజ్‌బల్ తదితరులు వీడి వెళ్ళారు.