Monday, December 23, 2024

బిసి పొలికేకేసిన బీహారీ నేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కులసామాజిక న్యాయం నేపథ్యపు మండల్ నినాదాన్ని బీహార్ సిఎం నితీశ్‌కుమార్ పునరుజ్జీవింపచేశారు. బీహార్‌లో కులాలవారి గణన, ఈ క్రమంలో వెలువడ్డ నివేదిక విడుదల తొలి సంచలనం అయింది. తరువాత వెనువెంటనే బీహార్ అసెంబ్లీలో ఈ నివేదిక ప్రాతిపదికన అత్యంత కీలకమైన రిజర్వేషన్ల కోటా బిల్లు ఆమోద ప్రక్రియ , దీనితో పాటు మరికొన్ని ఇతర చర్యలు కూడా చేపట్టడంతో ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు సామాజిక న్యాయం, కులాలవారిగా సముచిత కోటాల విషయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఇండియా కూటమి ప్రయోగంతో ప్రతిపక్షాల ఐక్యతకు మార్గనిర్ధేశనం చేసిన నితీశ్ ఈ ప్రతిపాదన సరైన రీతిలో ముందుకు సాగని దశలో కుల జనగణనను చేపట్టడం జాతీయ స్థాయిలో ప్రత్యేకించి రాజకీయ వర్గాలలో తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ క్రమంలో బిజెపికి సరైన పోటీగా ప్రతిపక్షాలను సహేతుక రీతిలో పోటీకి నిలిపేందుకు ఇది ఓ కీలక మలుపు అయింది.

దేశంలోని వెనుకబడిన వర్గాలు (బిసిలు) ప్రధాన కేంద్రంగా ఉన్న సామాజిక న్యాయం రాజకీయాలు ఇప్పుడు అనివార్యంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అజెండాలో అగ్రస్థానం వహించే పరిస్థితి ఏర్పడింది. ఈ అంశం లేకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికలను సరైన విధంగా తట్టుకుని నిలవడం ఇప్పుడు కష్టం కానుంది. బీహార్‌లోని ఎస్‌సి, ఎస్‌టిలు,బిసిలకు , ఇబిసిలకు ఇప్పటివరకూ ఉన్న 50 శాతం రిజర్వేషన్ల కోటాను మొత్తం మీద కలిపి 65 శాతానికి పెంచే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవలే చారిత్రక బిల్లు ఆమోదం పొందింది. 1989 ప్రాంతంలో విపి సింగ్ సారధ్యపు సంకీర్ణ ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన మండల్ కమిషన్ నివేదిక భారత రాజకీయాల్లో మైలురాయి అయింది. రాజకీయాలకు కేంద్ర బిందువుగా మండల్ నిలిచింది. దేశంలో రాజకీయ పార్టీల ప్రాబల్యపు పాలన కాదు కావల్సింది. వెనుకబడిన వర్గాల ప్రాతిపదికన ఉండే సామాజిక న్యాయపు సోషలిస్టు తరహా పాలన అవసరం అని మండల్ కమిషన్ నివేదిక తన ప్రతిపాదనల ద్వారా పరోక్షంగా స్పష్టం చేసింది.

ఈ క్రమంలో అప్పటివరకూ కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న బీహార్ ఇతర రాష్ట్రాలలో ఈ తరహా పాలనకు దారి ఏర్పడింది. ఓ వైపు సోషలిస్టులు తమకు అంతకు ముందటి వరకూ బలం ఉన్న యుపి, హర్యానా, కర్నాటకలలో ఎన్నికల రేసుల్లో చతికిల పడుతూ వచ్చినా ఇందుకు వ్యతిరేకంగా బీహార్, ఒడిషా వంటి రాష్ట్రాలలో సోషలిస్టుల తమ జెండా ఎగురేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇతర ప్రధాన పార్టీల ప్రాబల్యం పలు విధాలుగా సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చింది.

1990 నుంచి బీహార్‌లో పెను మార్పుల బలీయ పవనాలు
దేశ రాజకీయాలకు సంబంధించి 1990 కీలక పరిణామాత్మక మార్పులకు దారితీసింది. అప్పటి నుంచి బీహార్‌ను లాలూ ప్రసాద్ యాదవ్, ఆ తరువాత రబ్రీదేవీ, నితీశ్ కుమార్ పాలిస్తూ వచ్చారు. వీరిలో లాలూ ప్రసాద్ యాదవ్ పూర్తి స్థాయిలో తన రాజకీయాలను కేవలం ఒబిసి అజెండాతోనే సాగించారు. ఒబిసి రాజకీయాలకు నాయకత్వం వహించారు. కాగా నితీశ్ కుమార్ జెడియు సుప్రీంగా ఉంటూ రాష్ట్రంలో మహాఘట్‌బంధన్ కూటమిని నడిపిస్తూ వచ్చారు. ఆయన కూడా లాలూ బాటను అనుసరించారు. అయితే తరువాతి క్రమంలో రెండు కారణాలతో ఈ బాట నుంచి వేరే బాట పట్టారు. కేవలం ఒబిసిలనే తమ రాజకీయ పంథాలోకి తీసుకోకుండా ఇతర వర్గాలను ప్రత్యేకించి బిజెపి కేంద్రీకృత అగ్రవర్ణాల మెప్పు కూడా పొందాలని తన వ్యూహానికి పదును పెట్టారు.

ఈ విధంగా ఓ కోణంలో నితీశ్‌ది ద్వంద్వ వైఖరి అయింది. కానీ ఎన్నికల ప్రక్రియలో విజయం కీలకం. దీనిని గుర్తించి బిజెపి మద్దతు తీసుకుని, ఈ పార్టీ ఓటుబ్యాంకులైన అగ్రవర్ణాల బలాన్ని కూడా సంతరించుకుని ముందుకు సాగడానికి కారణం ముందుగా లాలూను దెబ్బతీయడం. బీహార్‌లోని బలీయమైన యాదవ్ వర్గాల నుంచి వచ్చిన లాలూను తట్టుకునేందుకు వేరే మార్గం ఎంచుకున్నారు. లాలూ బీహార్‌లో కేవలం 3 శాతం లోపునే ఉన్న కుర్మీ కులాల నుంచి వచ్చారు. రాష్ట్రంలో యాదవ్‌ల సంఖ్యాబలం 14 శాతం వరకూ ఉంది. దీనితో తనకున్న ఓబిసి మండల్ బలాన్ని పటిష్టం చేసుకుంటూనే నితీశ్ అన్ని కులాల మిశ్రితం వంటి ఇంద్రధనుస్సు చాపం వంటి రాజకీయ కూటమిని ఖరారు చేసుకున్నారు. అగ్రవర్ణాలు మొదలుకుని ఒబిసిలు, ఇబిసిలు, ఎస్‌సిలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రాధాన్యతగా ఎంచుకున్నారు.

బిజెపితో పొత్తు దశలోనూ బిసిల మంత్రమే
బీహార్‌లో చిరకాలం బిజెపితో రాజకీయ కూటమిగా సాగిన దశలోనూ నితీశ్ కుమార్ తన రాజకీయ వైఖరికి మూలమైన బిసిలు, ప్రత్యేకించి ఇబిసిలు, ఎస్‌సిల విషయంపైనే దృష్టి సారిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన కర్పూరి ఠాకూర్ తరహా రాజకీయాల పద్థతిలో సాగారు. ప్రాబల్యపు ఒబిసి గ్రూప్‌లు అయిన యాదవులు, కొయిరిలు, కుర్మిలు, బనియాలు కూడా కోటా లాభాలు పొందుతూ ఉంటే నిజానికి క్షేత్రస్థాయిలోని వెనుకుబడిన వర్గాలకు కులాలకు కోటాల ద్వారా సరైన ప్రయోజనం లేదనేది ఠాగూర్ ఫార్మూలా. ఇబిసిలు, ఎస్‌సిల కోసం నితీశ్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. బడుగు వర్గాలకు స్కాలర్‌షిప్‌లు, స్కూలు యూనిఫాంలు, ఉచిత పాఠ్యపుస్తకాలు , వృత్తిపరమైన శిక్షణ, ఇళ్ల వసతి, ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు.

కుల గణన అవసరం ఎందుకొచ్చింది?
ఇప్పుడు బీహార్‌లో కులాల వారి జనగణనలఅవసరం ఎందుకు వచ్చింది? అనేది కీలక ప్రశ్న అయింది. బిసిల కోసం ఇప్పటికే తాము పలు పథకాలు తీసుకువచ్చామని ఇక్కడి ప్రభుత్వం చెపుతోంది. ఈ దశలో తిరిగి బిసిల సామాజిక పరిస్థితి మార్చేందుకు కులాలవారి గణనలు అవసరం అని నితీశ్ ఎందుకు చెపుతున్నారు. అయితే బిజెపి ప్రాబల్యాన్ని అన్ని కులాల స్థాయిల్లో దెబ్బతీసేందుకు, బిసిల విషయంలో తాము ప్రధానంగా చొరవ తీసుకుంటున్నామనే విషయాన్ని ఎన్నికల దశలో మరోసారి చాటుకునేందుకు నితీశ్ ఈ జనగణనకు తెరతీసినట్లు స్పష్టం అయింది. కోటాలు ఖరారు చేయడమే కాకుండా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలను కేవలం నిర్ధేశిత వర్గాలకు చేరేలా చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలియచేసుకోవడం, తమ సామాజిక న్యాయ,

బిసిపక్ష గుర్తింపును ఇతరుల కన్నా బలీయంగా చాటుకోవడం వంటివి నితీశ్ ఇప్పుడు చేపట్టిన కులగణన, తరువాతి కోటా బిల్లు నిలిచాయి. ఆయన కల్పించిన కోటా మొత్తం మీద కలిపితే సుప్రీంకోర్టు నిర్ధేశిత 50 శాతం వాటాను దాటింది. దీనిని అధిగమించడం మరో ఘట్టం అవుతుంది. ఏది ఏమైనా బిజెపి ప్రాబల్య రాజకీయాల నుంచి అందనంత దూరానికి వెళ్లేందుకు తనకు తాను నిర్మించుకున్న దుర్భేధ్యపు ప్రాకారంగా దీనిని మలుచుకోవాలని పలువురు రాజకీయ విశ్లేషకులు, సామాజిక నిపుణుల సలహాల అండదండలే ఆయన ఎంచుకుంటున్న ఇప్పటిదారికి దారితీశాయని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News