Sunday, January 19, 2025

బియ్యం కయ్యం!

- Advertisement -
- Advertisement -

కేంద్రంలోని బిజెపి పాలకులు తమ ప్రత్యర్థుల మీద ఎందుకు ఇంతటి నేలబారు రాజకీయాస్త్రాలను తరచూ సంధిస్తుంటారో, వాటి ద్వారా ఎందుకు తలనొప్పులు తెచ్చుకొంటారో, భవిష్యత్ ఘోర పరాజయాలకు బాటలు ఎందుకు తమంత తామే వేసుకొంటారో అర్థం కాదు. ఇతర దేశాల్లోని జనం ఆకలి తీర్చడానికి ఉదారంగా సాయం చేయడాన్ని దేశ దేశాల ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతగా స్వీకరిస్తాయి. పెను ఉపద్రవాలు సంభవించి అక్కడి ప్రజలు కూడు, గుడ్డకు దూరమైపోయిన దుర్దినాల్లో వారిని ఆదుకోడానికి పోటీపడతాయి. మన దేశంలో మాత్రం ఏ రాష్ట్ర ప్రజలైనా ఎన్నికల్లో ప్రతిపక్షానికి అధికారం కట్టబెడితే ఆ ప్రజలకు మెతుకు లేకుండా చేయాలని కేంద్ర పాలకులు కక్షబూనడం ఎంత నీచమైన ప్రతీకార రాజకీయమో వివరించనక్కర లేదు. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని అధికారాన్నిచ్చిన కర్ణాటక ప్రజలపై కేంద్రంలోని కమలనాథులు ఇదే కుట్రకు తెర తీశారు.

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) నిలల నుంచి రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేసే సంప్రదాయాన్ని ఉన్నపళంగా ఊడబెరికారు. మొన్నటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో దారిద్య్ర రేఖకు దిగువ గల వారికి, అంత్యోదయ కార్డులున్న వారికి అన్నభాగ్య పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం వీరికి నెలకు 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. తిరుగులేని ప్రజామోదంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ పథకాన్ని తక్షణం అమల్లోకి తేవాలని సంకల్పించి అందుకు తగిన ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. ఈ నెల 9న ఎఫ్‌సిఐకి రాసిన లేఖలో అన్నభాగ్య యోజన పథకం కింద సరఫరా చేయడానికి 2.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సమకూర్చవలసిందిగా కోరింది. ఇందుకు గాను క్వింటాలుకు రూ. 3400, రవాణా కింద కి.మీకు రూ. 2.6 చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చింది.

దానికి సమాధానంగా రాసిన రెండు లేఖల్లో ఆ మేరకు బియ్యాన్ని సరఫరా చేయడానికి ఎఫ్‌సిఐ అంగీకరించింది. దానితో అన్నభాగ్య పథకం ప్రారంభ తేదీని కూడా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. వెనువెంటనే రాష్ట్రాలకు బియ్యాన్ని సమకూర్చే పద్ధతినే ఉపసంహరించుకొన్నట్టు కేంద్రం ఎఫ్‌సిఐకి తెలియజేసింది. కేంద్రం వద్ద 7 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మూలుగుతున్నాయని సిద్ధరామయ్య అన్నారు. అన్ని నిల్వలుంచుకొని రాష్ట్రాలకు బియ్యం, గోధుమ సరఫరా నిలిపివేయడంలో ఆంతర్యం కక్ష సాధింపేనని, పేదల పట్ల వ్యతిరేకతేనని ఆయన ఆరోపించారు. ఇందులో తప్పు పట్టవలసిందేమీ లేదు. ఇంకొక వైపు పెట్రోల్‌లో కలపదలచే ఎథనాల్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా క్వింటాలు రూ. 2000 కే బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. కర్ణాటక క్వింటాలుకు రూ. 3400 చెల్లించడానికి సిద్ధమైంది. పేదల ఆకలి తీర్చడానికి ఆ బియ్యాన్ని సరఫరా చేయదలచింది.

పేదల ఆకలి తీర్చడం కంటే ఎథనాల్‌కు సరఫరా చేయడం అత్యవసరం కాదు కదా! ఈపాటి మానవత స్పృహ బిజెపి పాలకులకు లోపించడం వారు పాటిస్తున్న హిందుత్వలో భాగమే అనుకోవాలా? వాస్తవానికి ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (బహిరంగ మార్కెట్‌లో అమ్మకం పథకం) ఎఫ్‌సిఐ వద్ద నిల్వలు పేరుకుపోయి పాడైపోకుండా చూడడానికి, దేశంలోని రైతులు పండించే పంటను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి ఖాళీ గోదాములను భర్తీ చేయడానికి ఉద్దేశించినది. 2013లో తీసుకు వచ్చిన జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏటా 81.3 కోట్ల లబ్ధిదారులకు 6 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, గోధుమను సరఫరా చేయవలసిన బాధ్యత కేంద్రంపై వున్నది. ఇందుకోసమే రాష్ట్రాల నుంచి ఈ రెండు రకాల ఆహార ధాన్యాలను సేకరించి ఎఫ్‌సిఐ గోదాములలో నిల్వ వుంచుతారు. కొన్ని సందర్భాల్లో ఆహార భద్రత అవసరాల కోసం సరఫరా చేసేదాని కంటే ఇలా సేకరించే ధాన్యాలే అధికంగా వుంటాయి.

అయినా అవసరానికి లోటు లేకుండా వుండడం కోసం కేంద్రం ఈ సేకరణను నిర్విఘ్నంగా చేపడుతుంది. ఇందులోని మంచిని కేంద్ర పాలకులు అర్థం చేసుకొని వుంటే నేలబారు రాజకీయ కక్ష కోసం కర్ణాటకకు ఈ విధంగా బియ్యం సరఫరాను నిరాకరించి వుండేవారు కాదు. ప్రత్యేకించి విమర్శించడం కోసం కాదు గాని, బిజెపి పాలనలో గత తొమ్మిది సంవత్సరాలుగా దేశంలో రాజకీయం ఎప్పుడూ లేనంత కక్ష బూనిన కత్తిగా మారిపోయింది. ప్రతిపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాలను అదే పనిగా ద్వేషిస్తూ వుండడం, వాటికి రుణ సౌకర్యాలు సహా ఏ సహాయాన్ని అందనివ్వకూడదనే తప్పుడు దృష్టితో విధానాలను రూపొందించడం, రాజ్‌భవన్లను కుట్రలు, కుహకాల వేదికలుగా మార్చడం, దర్యాప్తు సంస్థలను దర్వినియోగం చేయడం వంటి అప్రజాస్వామిక ధోరణి మితిమించిపోతున్నది. ఇది దేశానికి మంచి చేయదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News