న్యూఢిల్లీ : వక్ఫ్ బోర్డులపై ఆధిపత్యాన్ని కేంద్రం కోరుకోవడం లేదని, కానీ అవి చట్టానికి లోబడి పని చేసేలా చూడాలని అనుకుంటున్నదని, దాని వల్ల వాటి ఆస్తులను ముస్లిం సమాజం విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి కల్పన ప్రోత్సాహానికి ఉపయోగపడతాయని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఆదివారం స్పష్టం చేశారు. బిజెపి 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ, తుర్కియే, పలు ఇతర ముస్లిం దేశాల్లోని ప్రభుత్వాలు వక్ఫ్ ఆస్తులను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయని చెప్పారు. ‘వాటిని (వక్ఫ్ బోర్డులను) నిర్వహిస్తున్నవారిని నిబంధనల ప్రకారం వ్యవహరించాలని మాత్రమే మేము కోరుతున్నాం.
మీరు నిబంధనల ప్రకారం ఆ పని చేయవలసి ఉంటుంది’ అని ఆయన చెప్పారు. ‘మేము వక్ఫ్ బోర్డు కట్టడిని కోరుకోవడం లేదు. వాటి నిర్వాహకులు చట్టం పరిధిలో పని చేసి, నిర్ధారిత నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూడడం మా లక్షం. వక్ఫ్ ఆస్తులు, నిధులను విద్యను ప్రోత్సహించడానికి, ముస్లిం సమాజం ఆరోగ్య సేవలు, ఉద్యోగావకాశాలు కల్పించడానికి అంకితం చేయాలి’ అని బిజెపి అధ్యక్షుడు తెలియజేశారు. ప్రసంగానికి ముందు నడ్డా బిజెపి ప్రధాన కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఎంపిలు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు పార్టీ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. 1951లో భారతీయ జన సంఘ్‌తో బిజెపి రాజకీయ ప్రస్థానాన్ని నడ్డా గుర్తు చేస్తూ, అది ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిందని, ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, కాంగ్రెస్ వలె కాకుండా తన సైద్ధాంతిక పునాది నుంచి పార్టీ ఎన్నడూ మళ్లలేదని, ‘సైద్ధాంతికంగా బలహీనం’ అయిన కారణంగా కాంగ్రెస్ కాలక్రమేణా క్షీణిస్తోందని వివరించారు.
‘ఇప్పుడు మాకు లోక్‌సభలో 240 మంది సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో 98 మందికి పైగా సభ్యులు ఉన్నారు, దేశవ్యాప్తంగా 1600 మందికి పైగా ఎంఎల్‌ఎలు ఉన్నారు. మేము ఇప్పుడే మా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముగించాం, బిజెపి సభ్యుల సంఖ్య 13.5 కోట్లు దాటింది. మాకు దేశంలో పది లక్షల మందికి పైగా క్రియాశీలక పార్టీ కార్యకర్తలు ఉన్నారు’ అని నడ్డా తెలియజేశారు. ‘శాస్త్రీయ వృద్ధి’ని చూసిన ఏకైక రాజకీయ పార్టీ బిజెపి అని ఆయన చెప్పారు. ‘సంస్థ విస్తరణ, ఎన్నికల్లో విజయం ఒక కళ, ఒకసైన్స్’ అని ఆయన పేర్కొన్నారు. ‘మా ప్రత్యర్థులు పార్లమెంట్‌లో మమ్మల్ని అవహేళన చేస్తున్నప్పటికీ మాది ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అని కూడా వారు చెబుతుంటారు.
తుదకు మా ప్రత్యర్థులు మా బలాన్ని గుర్తిస్తున్నారు’ అని నడ్డా తెలిపారు. బిజెపి ఎల్లప్పుడూ దేశమే ముందు అనే విధానాన్ని పాటించిందని, భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని, చరిత్రను ప్రోత్సహించేందుకు కృషి చేసిందని, పార్టీ హయాంలో అయోధ్యలో ‘అద్భుతమైన’ రామాలయ నిన్మాణం జరిగిందని నడ్డా తెలియజేశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ షా బానో కేసులో ముస్లిం సమాజంలోని కొన్ని వర్గాల నుంచి ఒత్తిడికి ‘లొంగి’ సంతుష్టి రాజకీయాలు చేసిందని ఆయన విమర్శించారు. ‘ముస్లిం మహిళల సముద్ధరణకు సుప్రీం కోర్టు పిలుపు ఇచ్చినప్పటికీ కచ్చితమైన చర్య తీసుకునే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది’ అని ఆయన ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి, ముస్లిం మహిళలకు విముక్తి కలిగించిందని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌లో ‘మతపరమైన వేధింపులు’ ఎదుర్కొన్న తరువాత భారత్‌కు వచ్చిన వారికి మోడీ ప్రభుత్వం పౌరసత్వ హక్కులు కూడా ప్రసాదించిందని బిజెపి అధ్యక్షుడు వెల్లడించారు. ‘వలసవాద మనస్తత్వం నుంచి బయటకు వస్తామని మేము చెప్పాం. రాజ్‌పథ్ ఇప్పుడు కర్తవ్య పథ్ అయింది. (ఇండియా గేట్ సమీపంలో) సుభాష్ చంద్ర బోస్ విగ్రహ ప్రతిష్ఠాపన కూడా జరిగింది’ అని నడ్డా తెలియజేశారు.