Saturday, January 25, 2025

రాహుల్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలి..

- Advertisement -
- Advertisement -

రాహుల్ పై కమలదళం ముప్పేట దాడి
పాక్, చైనాలా మాట్లాడుతున్న రాహుల్
మండిపడిన బిజెపి అధ్యక్షుడు నడ్డా
రాహుల్‌ను కాంగ్రెస్‌నుంచి బహిష్కరించాలి
బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్
న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సైనికులు భారత జవాన్లపై దాడి చేసి కొడుతున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాహుల్ గాంధీ చైనా, పాక్ లాగా మాట్లాడుతున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దుయ్యబట్టగా, ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మరో అడుగు ముందుకు వేసి భారత దేశ ప్రతిష్ఠను దిగజార్చి, సాయుధ బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీనుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.‘ ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ దేశభక్తిపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఆయన గతంలో సర్జికల్ స్ట్రైక్స్‌ను, బాలాకోట్ వైమానిక దాడులను కూడా ప్రశ్నించారు. ఇది ఆయన మానసిక దివాలాకోరుతనానికి అద్దం పడుతోంది’ అని నడ్డా అన్నారు.

కాగా రాహుల్ గాంధీని పృథ్వీరాజుకు వెన్నుపోటు పొడిచిన కనౌజ్ రాజు జయచంద్రతో పోల్చిన బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా సాయుధ బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి రాహుల్ నిరంతరం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన సర్జికల్ దాడులను, గల్వాన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణల సందర్భంగా కూడా రాహుల్ ఇలాగే మన సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి రాహుల్ ప్రయత్నించారని భాటియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ గనుక భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లయితే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే రాహుల్‌ను పార్టీనుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.దేశ ప్రజలకు రాహుల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశానికే సమస్యగా మారిన రాహుల్: రిజిజు
ఇదిలా ఉండగా ఈ నెల 9న భారత, చైనా సైనికలు మధ్య ఘర్షణ చోటుచేసుకున్న తవాంగ్ ప్రాంతాన్ని కేంద్ర న్యాయాశాఖ మంత్రి శనివారం సందర్శించారు. తవాంగ్ భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అనంతరం ఆయన ప్రకటించారు. చైనా యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉంటే కేంద్రం మొద్దు నిద్ర పోతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రిజిజు ఓ ట్వీట్‌లో తిప్పికొట్టారు.‘రాహుల్ గాంధీ కేవలం భారత ఆర్మీని అవమానించడమే కాదు, దేశ ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తున్నారు.ఆయన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సమస్య కాదు, దేశాన్ని కూడా కలవరపాటుకు గురి చేస్తున్నారు. మన సాయుధ బలగాలను చూసి దేశం గర్విస్తోంది’ అని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలను తప్పుబడుతూ స్థానికులు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఒక వీడియోను సైతం విడుదల చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News