Monday, December 23, 2024

అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో వారి జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్న కేంద్రమంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, దీని నిర్మాణానికి తొలి విడతగా దాదాపు రూ.900 కోట్లను కేటాయించడంతోపాటుగా.. ఈ విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరును పెట్టిన ప్రధానమంత్రికి.. గిరిజన సమాజం తరపున, రాష్ట్ర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ, యువకులకు పదిశాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్ లో రూ. 25 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టబోతున్న విషయాన్ని, 6.5 కోట్ల కేంద్ర నిధులతో గిరిజన పరిశోధన సంస్థ ప్రారంభానికి సిద్దంగా ఉన్న విషయాన్నీ ఆయన వెల్లడించారు. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చే విషయంలోనూ ప్రధానమంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్యారంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.420 కోట్లతో.. 17 కొత్త ఏకలవ్య పాఠశాలలను’ కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. స్వదేశ్ దర్శన్ పథకం కింద ‘ములుగు – లక్నవరం – మేడారం – తాడ్వాయి – దామరవాయి – మల్లూరు – బొగత జలపాతం’లను కలుపుతూ గిరిజన సర్క్యూట్ పేరుతో ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించాం. ఇందుకోసం రూ.80 కోట్లను కేంద్ర ప్రభుత్వ ఖర్చు చేసిందని వెల్లడించారు.

సోమశిల, సింగోటం, కదళీవనం, అక్కమహాదేవి, ఈగలపెంట, ఫరాహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం మధ్య ఎకో-సర్క్యూట్ అభివృద్ధి కోసం రూ. 92 కోట్లను ఖర్చు చేసి పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పార్టీఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపిలు గరికపాటి మోహన్‌రావు, రవీంద్ర నాయక్, రమేశ్ రాథోడ్,ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బిజెపి ముఖ్యనాయకులు, పెద్ద సంఖ్యలో గిరిజన సోదర, సోదరీమణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News