భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జెపి నడ్డా శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో మొదటి భాగాన్ని శుక్రవారం విడుదల చేశారు. మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం, వృద్ధులకు నెలకు రూ. 2500 పింఛన్ అందజేయనున్నట్లు, రూ. 500 ధరలకు ఎల్‌పిజి సిలిండర్లు సరఫరా చేయనున్నట్లు నడ్డా ప్రకటించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన పక్షంలో ఢిల్లీలో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కూడా ఆయన హామీ ఇచ్చారు. ‘సంకల్ప్ పత్ర’ మొదటి భాగం విడుదల సందర్భంగా విలేకరుల గోష్ఠిలో నడ్డా ప్రసంగిస్తూ, పార్టీ మేనిఫెస్టో అభివృద్ధి చెందిన ఢిల్లీకి పునాది అని చెప్పారు.
అర్వింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై నడ్డా విరుచుకుపడుతూ, ప్రస్తుత ప్రజా సంక్షేమ పథకాలపై వచ్చిన అన్ని అవినీతి ఆరోపణలనూ దర్యాప్తు చేయనున్నట్లు తెలియజేశారు. బిజెపి నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం తన తొలి మంత్రివర్గ సమావేశంలో నగరంలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలుకు ఆమోద ముద్ర వేస్తుందని, రూ. 5 లక్షల అదనపు ఆరోగ్య బీమా వర్తింపజేస్తుందని కూడా ఆయన వాగ్దానం చేశారు. నిరుపేద వర్గాలకు చెందిన మహిళలకు రూ. 500 ధరకు ఎల్‌పిజి సిలిండర్లను బిజెపి ఇస్తుంది. హోళీ, దీపావళి సందర్భంగా ఉచితంగా ఒక సిలిండర్ సరఫరా చేస్తుంది’ అని నడ్డా తెలిపారు. 60, 70 ఏళ్ల మధ్య వృద్దులకు నెలకు రూ. 2500 మేరకు, 70 దాటినవారికి రూ. 3000 మేరకు పింఛన్ పంపిణీ చేయనున్నట్లు కూడా బిజెపి అధ్యక్షుడు వాగ్దానం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, 8న ఫలితాలు ప్రకటిస్తారు.