Monday, January 20, 2025

కెటిఆర్‌కు దమ్ముంటే కిషన్‌రెడ్డి చేపట్టిన పనులపై చర్చకు రావాలి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారని అడుగుతున్న మాజీ మంత్రి కెటిఆర్‌కు దమ్ముంటే చర్చకు రావాలని రాష్ట్ర బిజెపి అధికారి ప్రతినిధి రాణి రుద్రమదేవి సవాల్ విసిరారు. లిక్కర్ దందా కేసులో జైలుకు వెళ్లిన కవిత మాదిరిగానే రేపోమాపో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సిఎం కెసిఆర్, డ్రగ్స్ దందాలు, భూకబ్జాల్లో కెటిఆర్, కాళేశ్వరంలో అవినీతి బయటకు వస్తే హరీశ్ రావు జైలుకు వెళ్లడం తప్పదని ఎద్దేవా చేశారు. బుధవారం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనపై విమర్శలు గుప్పించిన సిఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో షాడో సిఎంగా వ్యవహరించిన కెటిఆర్ సికింద్రాబాద్ కు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడం సరికాదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కన్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు కుటుంబ పాలన వద్దని బిఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఓడగొట్టేసరికి యువ నాయకుడు మతిభ్రమించి స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి రూ. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధికి నిధుల తెచ్చారని, ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్ర వాటా చెల్లించకున్నా పూర్తి కేంద్ర నిధులతోనే పూర్తయి, రైళ్లు తిరుగుతున్నాయంటే అది ఆయన కృషి అన్న సంగతి మరిచిపోవద్దన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరం రింగ్ రైల్ లైన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందంటే ఆయన చొరవనేని, కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్లతో చర్లపల్లి టర్మినల్ ను అభివృద్ధి చేస్తుంటే గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదని విరుచుకపడ్డారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని, టిమ్స్, కింగ్ కోటి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశారని తెలిపారు.

దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కిషన్ రెడ్డికి ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పజెప్పిందని పేర్కొన్నారు. కరోనాతో ప్రపంచం అల్లాడిపోయిందని, భారతదేశంలో వ్యాక్సిన్ తయారుచేసి వందదేశాలకు వ్యాక్సిన్లను పంపించి ప్రజల ప్రాణాలు కపాడిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కెటిఆర్ జిహెచ్‌ఎంసీ మున్సిపల్ మంత్రి అయ్యేనాటికి రూ. 5 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉంటే ఆ డబ్బులను మాయం చేసి జిహెచ్‌ఎంసీకి రూ. 10 వేల కోట్ల అప్పులపాలు చేశారని ఆరోపించారు. గవర్నర్ తమిళిసై, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరంగల్ ఎంజీఎంకు వెళ్లి డాక్టర్లకు భరోసా కల్పించి, ప్రజలందరి మేమున్నాం ధైర్యం కల్పిస్తే బిఆర్‌ఎస్ నాయకులు ఇంటికే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం ప్రజలు నమ్మని వాగ్దానాలు చేస్తే మాజీ సిఎం కెసిఆర్, కెటిఆర్ బాట సిఎం రేవంత్‌రెడ్డి కూడ పట్టక తప్పదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News