Monday, December 23, 2024

సామాజిక న్యాయ స్వరం

- Advertisement -
- Advertisement -

అధికార రాజకీయాలు ఎంతో కాలం ఆకాశంలో విహరించజాలవు. ఎప్పుడో ఒకప్పుడు అణగారిన వర్గాల వశం కాక తప్పదు. ఒకప్పుడు ఒకవైపు ముస్లింలు, ఎస్‌సిల మద్దతు మరోవైపు అగ్ర వర్ణాల అండదండలతో దేశాన్ని చిరకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉత్తరాదిలో నామరూపాలు లేకుండా పోయింది. ఎస్‌సిలు చైతన్యవంతులు కావడం, బాబ్రీ మసీదు పతనం తర్వాత ముస్లింలు కూడా దానికి దూరం కావడం ఇందుకు కారణం. మండల్, కమండల్ వివాదంతో యాదవులు తదితర ఒబిసిలు సంఘటితమయ్యారు. వారి మద్దతుతో యుపిలో ములాయం సింగ్ యాదవ్, బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ తమ సోషలిస్టు నేపథ్యంతో ముందుకు దూసుకొచ్చారు. అలాగే కాన్షీరామ్, మాయావతి ఎస్‌సిల ఎదురులేని నేతలుగా తయారయ్యారు. ఒబిసిలు కుల ప్రాతిపదికన చైతన్యవంతం కావడం బొత్తిగా ఇష్టంలేని బిజెపి మతాన్ని ఆయుధం చేసుకొని ముస్లింలను దురాక్రమణదారులుగా చిత్రించి తన పబ్బం గడుపుకోడం ప్రారంభించింది.

అందులో దానికి బలమైన మద్దతు ఒబిసిల నుంచే లభించింది. దాని పట్టు నుంచి ఒబిసిలను విముక్తం చేయడం కోసం ప్రతిపక్షాలు ఇప్పుడు కులాల వారీ జన గణన కోసం పట్టుపడుతున్నాయి. కులాలకు అతీతంగా హిందువులంతా ఏకం కావాలన్న బిజెపి వ్యూహాన్ని కుల జన గణన డిమాండ్‌తో ధ్వంసం చేయాలని తద్వారా మత సామరస్యాన్ని కాపాడి సెక్యులర్ భారతాన్ని రక్షించుకోవాలని అవి సంకల్పించాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా చేరడం ఆ వైపుగా అది ఇప్పుడు అపూర్వ స్థాయిలో గళం విప్పడం విశేషం. వాస్తవానికి కులాల వారీ జన గణన డిమాండ్‌ను ఇటీవలి కాలంలో ముందుగా చేపట్టిన ఘనత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు దక్కుతుంది. వారు నేరుగా ప్రధాని మోడీనే కలిసి జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులాల వారీ లెక్కింపును చేపట్టాలని కోరారు. అయినా బిజెపి అందుకు అంగీకరించలేదు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఒకేసారి కుల గణన చేపట్టాలని, రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచాలని డిమాండ్ చేశారు.

ఒబిసిలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో 27% రిజర్వేషన్లను కల్పించాలని సిఫారసు చేస్తూ 1980లో సమర్పించిన మండల్ కమిషన్ నివేదికను దశాబ్ది కాలం పాటు చెదలకు ఆహారం చేసి తొక్కిపెట్టిన ఘనత కాంగ్రెస్‌దే. ఎస్‌సిలు, ముస్లింల ఓటుతో అధికారం పొందుతూ ఉన్నత పదవులను మాత్రం అగ్ర వర్ణాలకు కట్టబెడుతూ వచ్చిన గొప్పతనం కూడా దానిదే. అటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు సామాజిక న్యాయం కోసం పోరాడదలచడం గణనీయమైన మార్పు. కులాల వారీ జనాభా లెక్కల సేకరణను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటకలోని కోలార్ ప్రచార సభలో మాట్లాడుతూ దేశంలో ఒబిసిల జనాభా ఎంతో తేలవలసిన అవసరం వుందని అన్నారు. 2011లో యుపిఎ ప్రభుత్వం జరిపిన కులాల వారీ సర్వే ఫలితాలను బయటపెట్టాలని కోరుతూ కుల గణనను డిమాండ్ చేస్తూ పిసిసి సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కూడా రాహుల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాలకు సూచించారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ రాష్ట్ర పరిధిలో కులాల వారీ జన గణనను జరిపిస్తున్నది. ఇంకొక వైపు కాంగ్రెస్ పాలనలోని చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎస్‌టి, ఎస్‌సి, ఒబిసిల రిజర్వేషన్లను 76 శాతానికి పెంచుతూ గత డిసెంబర్‌లో రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. దానికి అక్కడి గవర్నర్ నుంచి ఆమోద ముద్ర ఇంకా లభించలేదు.

ఈ బిల్లులను రాజ్యాంగం 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ప్రధాని మోడీకి సోమవారం నాడు లేఖ రాశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు కులాల వారీ జన గణన డిమాండ్‌ను ప్రధాన ప్రచారాంశంగా ప్రతిపక్షం చేపట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలోని అన్ని కులాల వారినీ హిందూత్వ చట్రంలో గట్టిగా బిగించి అధికారంలో నిరంతరంగా కొనసాగాలనుకుంటున్న బిజెపిని మట్టికరిపించడానికి ఇదొక్కటే మార్గమని కాంగ్రెస్ సహా మొత్తం ప్రతిపక్షం నిర్ధారించుకొన్నట్టు బోధపడుతున్నది. ఎన్నికలలో గెలుపు వ్యూహాల సంగతి అటుంచితే దేశ జనాభాలో అత్యధిక శాతంగా వున్న ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీల నుంచి అధికార అందలాలను దూరంగా వుంచడం నిత్యం సాధ్యమయ్యే పని కాదు. అధికారంలో, ఉన్నత విద్య, ఉద్యోగాల్లో తమ వాటా ఎంతో ఈ వర్గాలు తెలుసుకోవాలంటే కుల గణన జరిపి తీరాల్సిందే. అలాగే వీరి జనాభా దామాషా ప్రకారం వీరికి న్యాయమైన లబ్ధి చేకూరాలంటే రిజర్వేషన్లపై ప్రస్తుతమున్న 50 % పరిమితి రద్దు కావల్సిందేనని ఈ వర్గాలు చేస్తున్న డిమాండ్ కూడా సానుభూతితో అర్థం చేసుకొని మద్దతు ఇవ్వదగినదే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News