భారతీయ జనతా పార్టీ (బిజెపి) అరుణాచల్ ప్రదేశ్ వరుసగా రెండవ సారి అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్లుకున్నది. రాష్ట్రంలోని 60 సీట్లలో బిజెపి 46 సీట్లను కైవసం చేసుకున్నది. ఎన్నికల కమిషన్ (ఇసి) డేటా ప్రకారం, సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కెఎం) అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలోని 32 సీట్లలో 31 సీట్లను ఎస్‌కెఎం గెలుచుకున్నది. ప్రత్యర్థి పక్షం సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎస్‌డిఎఫ్)కు కేవలం ఒక్క సీటు వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లో బిజెపి ఇంతకు ముందే పది సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకున్నది. మిగతా సీట్లకు వోట్ల లెక్కింపు ఆదివారం ఉదయం మొదలైంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) ఐదు సీట్లను, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పిపిఎ) రెండు సీట్లను, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) మూడు సీట్లు, కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోగా ఇండిపెండెంట్లకు మూడు సీట్లు లభించాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో బిజెపి మెజారిటీ మార్క్ దాటగానే వేడుకలు మొదలయ్యాయి. సిక్కింలో కూడా ఎస్‌కెఎం పునర్విజయానికి పార్టీ కార్యకర్తలు పాడుతూ, చప్పట్లు కొడుతూ వేడుకలు చేసుకున్నారు. ‘బిజెపిపై తిరిగి నమ్మకం కలిగి ఉన్నందుకు’ అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ’ఎక్స్’ పోస్ట్‌లో ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ మరొక పోస్ట్‌లో సిక్కింలో విజయం సాధించిన ఎస్‌కెఎంను, ఆ పార్టీ చీఫ్ ప్రేమ్ సింగ్ తమంగ్‌ను అభినందించారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరిగాయి. సిక్కింలో 79.88 శాతం, అరుణాచల్ ప్రదేశ్‌లో 82.95 శాతం పోలింగ్ నమోదైంది. సిక్కింలో బిజెపి, కాంగ్రెస్ కూడా పోటీ చేశాయి కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి.