సభలో విలపించిన ఎంపి రూపా గంగూలీ
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూం జిల్లాలో ఇటీవల జరిగిన మారణకాండపై బిజెపి ఎంపి రూపా గంగూలీ రాజ్యసభలో విలపించారు. ఈ ఘటనలో ఎనమండుగురి వధ జరిగింది. అక్కడ అత్యంత అమానుష ఘటన జరిగింది. ప్రజల ప్రాణాలను రక్షించలేని స్థితిలో బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడి టిఎంసి ప్రభుత్వం ప్రజలను రక్షించడం లేదు. బెంగాల్ ఇప్పుడు ప్రజలు జీవించడానికి వీల్లేని ప్రాంతం అయింది. జనం భయంతో వలస వెళ్లుతున్నారు. సామూహిక హత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వం పోలీసు వర్గాలతో హంతకులను రక్షిస్తోంది. దీనితో వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఎన్నికల తరువాత కూడా విద్వేషపూరిత రాజకీయాలకు దిగే రీతిలో అక్కడి వ్యవహారాలు ఉన్నాయి. ‘మేం మనుష్యులం, ఇటువంటి మనసులేని చర్యలకు పాల్పడబోమని రూపా గంగూలీ తెలిపారు. టిఎంసికి అధికారంలో కొనసాగే హక్కులేదు. వెంటనే కేంద్రం స్పందించి, రాష్ట్రపతి పాలన విధించాల్సిందే అని ఆమె పేర్కొన్నారు. దుండగులు అత్యంత పైశాచికంగా ప్రవర్తించారని అక్కడి ఘటన కలిచివేసిందని తెలిపి ఆమె సభలోనే భోరున ఏడ్చారు. అక్కడి పైశాచికానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.