మహు (మధ్య ప్రదేశ్) : రాజ్యాంగ పరిరక్షణకు సంఘటితం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం విజ్ఞప్తి చేశారు. అలా కానిచో దళితులు, బిసిలు, ఆదివాసీలు, నిరుపేదలు ఇక్కట్లు ఎదుర్కొంటారని ఖర్గే అన్నారు. మహులో ‘జై బాపు, జీ భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ప్రసంగించిన ఖర్గే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వారిని ‘దేశద్రోహులు’గా అభివర్ణించారు. మతం పేరిట నిరుపేద వర్గాలను దుర్వినియోగం చేయడాన్ని కాంగ్రెస్ ఎన్నటికీ సహించబోదని ఆయన చెప్పారు. మహా కుంభమేళాలో బిజెపి నేతలు పవిత్ర స్నానాలు చేయడాన్ని ఖర్గే అపహాస్యం చేస్తూ, పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం వల్ల పేదరికం తొలగిపోదని అన్నారు, అయితే, ఏ ఒక్కరి ‘విశ్వాసాన్నీ’ నొప్పించడం తన ఆకాంక్ష కాదని ఆయన స్పష్టం చేశారు.
‘బిజెపి నేతలు కెమెరాల కోసమే గంగా నదిలో స్నానం కోసం పరస్పరం పోటీ పడుతున్నారు’ అని ఆయన విమర్శించారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇదే ర్యాలీలో మాట్లాడుతూ. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ బిఆర్ అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని కించపరిచాయని ఆరోపించారు. అధికారంలో ఉన్న వారి నుంచి దానిని కాపాడవలసిందిగా పార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహిస్తుందని కూడా ఆయన ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీకి కుల గణన అంటే భయం కనుక ఆయన ఎన్నటికీ దానిని నిర్వహించబోరని రాహుల్ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలపై తన విమర్శలను ఖర్గే కొనసాగిస్తూ, ‘ప్రతి మసీదులో శివలింగం కోసం చూడడం లేదు’ వంటి ప్రకటనలను వారు చేస్తున్నారని, కానీ అలా చేయవలసిందిగా ప్రజలను ‘ప్రేరేపిస్తున్నారు’ అని ఆరోపించారు.
ఇప్పుడు కాంగ్రెస్‌ను దూషిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ వారు దేశ స్వాతంత్య్ర పోరాటానికి, స్వాతంత్య్రానికి చేసింది ఏమీ లేదని, వారు బ్రిటిష్ వారితో చేరి ఉండడమే అందుకు కారణమని ఖర్గే అన్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు దేశద్రోహులు. మీరు దారిద్య్రం, నిరుద్యోగిత నుంచి విముక్తం కావాలని అభిలషిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించండి, సమైక్యంగా ఉండండి’ అని ఖర్గే అన్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నిరుడు రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చకు సమాధానం ఇస్తూ అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ పట్ల ఆయన ‘అసలు ‘భావనలను’ సూచించాయని ఖర్గే ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షాను ఖర్గే తూర్పారపడుతూ, ‘100 జన్మల్లో కూడా స్వర్గానికి వెళ్లలేనంతగా వారు పాపాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఛేదించి, లోక్‌సభలోను, రాజ్యసభలోను దీనిపై ఒక చట్టం తీసుకువస్తుందని కూడా రాహుల్ స్పష్టం చేశారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్రం బిలియనీర్ల కోసం పని చేస్తోందని రాహుల్ ఆరోపిస్తూ, ఉద్యోగావకాశాలు అంతమైనందున, దేశ సంపదను కొద్ది మంది ఆశ్రిత పెట్టుబడిదారుల పరం చేస్తున్నందున దళితులు, బిసిలు, ఆదివాసీలు, నిరుపేదలను మళ్లీ బానిసలను చేస్తున్నారని అన్నారు. ‘నిరుపేదలకు ఎటువంటి హక్కులూ లేని, సంపన్నులకు మాత్రమే హక్కులు ఉన్న స్వాతంత్య్రం ముందునాటి పరిస్థితిని దేశంలో తీసుకురావాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అనుకుంటున్నాయి’ అని రాహుల్ ఆరోపించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆ రెండూ ప్రయత్నిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. అందుకే వారు నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో ‘400 పార్’ నినాదం చేశారని రాహుల్ పేర్కొన్నారు. అంబేద్కర్ కృషిని బిజెపి అవమానించిన తీరుకు నిరసన సూచకంగా అంబేద్కర్ జన్మ స్థలంలో ర్యాలీకి కాంగ్రెస్ సంకల్పించింది.