మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగా ణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలం టే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని కేం ద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజె పి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. గత బిఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీల పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో కిషన్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆదివారం బిజెపిలో చేరారు.
ఖైరతాబాద్‌కు చెందిన పలువురికి పార్టీ కండువా కప్పి కిషన్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పజా ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో వస్తుందని తెలిపారు. గడచిన పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం అందించిన తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలకు పట్టం కట్టే ప్రభుత్వం రానుందని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డపై కేసీఆర్, రేవంత్ రెడ్డిలు అప్పులు చేయడం, దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, దీంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీలో వీధిలైట్ల మరమ్మతులకు ఏడు నెలల నుంచి నిధులు లేవని, మద్యం సరఫరా చేసిన కంపెనీలకు కూడా డబ్బులిచ్చే పరిస్థితి లేదనే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు. ఎక్సైజ్ శాఖ బిల్లులు మళ్లింపుతో చివరకు బీర్లు సరఫరా చేయలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనిలో బీఆర్‌ఎస్ ఉందన్న కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారన్నారని కొనియాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల విధ్వంస పాలన చూశామని, ఇప్పుడు 11 నెలల కాంగ్రెస్ పాలన కూడా చూశామని, రెండు పార్టీలు తెలంగాణను దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేశాయని ఇప్పటికే రుజువైందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలన సాగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధిలో విఫలమై పరస్పరం విమర్శలతో తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్‌గాంధీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు
తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలెఉ చేసిన తర్వాతే తెలంగాణకు రాహుల్ రావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. పీవీ నర్సింహారావును అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలకు వంద రోజులు గడిచిపోయాయని, వాటిపై సమాధానం చెప్పాకే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగుపెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, దళితులు, రైతులు, వృద్ధులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజ్యాంగం పేరిట రాహుల్ గాంధీ ఆందోళనలకు దిగుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వడంతో పాటు చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టడంతో పాటు ఆయన ఐదు స్మారక స్థలాలను పంచ తీర్ధ పేరుతో అభివృద్ధి చేస్తుందన్న సంగతి మరువరాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఎప్పుడు గాంధీల కుటుంబ భజన తప్ప మరో నాయకుడిని గౌరవించే సంస్కృతి లేదన్నారు. గాంధీయేతర కాంగ్రెస్ నాయకుల అంత్యక్రియల్లోనూ వివక్షత చూపారని విమర్శించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా భారత సంవిధాన్ గౌరవ్ అభియాన్ భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. , రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు యువత బీజేపీలో చేరాలని.. సేవ్ తెలంగాణ, సపోర్టు బీజేపీ నినాదంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రానున్న రోజుల్లో అధికారంలో వచ్చేందుకు ముందుడుగు వేయాలని కిషన్ రెడ్డి కోరారు.