రాయపూర్: దేశంలో ఏక సిద్ధాంత పాలన ఉండాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కోరుకుంటున్నప్పటికీ అది ఎన్నటికీ సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని భూమి లేని నిరుపేదలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అందచేస్తున్న ఆర్థిక సహాయ పథకాన్ని గురువారం నాడిక్కడ రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి, ఆ పార్టీ సిద్ధాంతం భారతదేశాన్ని ప్రమాదం అంచుల వైపు నెడుతున్నాయని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే ఆ పార్టీ నుంచి ఎదురవుతున్న ముప్పని అన్నారు. గత 70 ఏళ్లలో దేశానికి ఏం చేశారని ప్రశ్నిస్తూ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీనే కాక దేశంలోని రైతులను, కార్మికులను అవమానిస్తోందని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌కు ఒక రోజు పర్యటన నిమిత్తం రాహుల్ గురువారం వచ్చారు. రాజీవ్ గాంధీ గ్రామీణ్ భూమిహిన్ కృషి మజ్దూర్ న్యాయ యోజన అనే పథకాన్ని ప్రారంభించడంతోపాటు విధి నిర్వహణలో వీరమరణం పొందిన సైనికులు, భద్రతా సిబ్బంది స్మృత్యర్థం మనా క్యాంపులో నిర్మించనున్న ఛత్తీస్‌గఢ్ అమర్ జవాన్ జ్యోతికి ఆయన శంకుస్థాపన చేశారు.
BJP rule of one ideology can never happen: Rahul Gandhi