Thursday, January 9, 2025

విమోచన పేరుతో బిజెపి హడావుడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ విమోచన పేరుతో బిజెపి హడావుడి చూస్తుంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడిలాగా ఉన్నదని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆనాడు పోరాటం చేసింది కమ్యూనిస్టులైతే, ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నది ఆనాడు పోరాటంలో లేని బిజెపి అని అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 74వ వారోత్సవాల సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో సురవరం సుధాకర్ రెడ్డి, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా , తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, తదితరులు పాల్గొని ప్రసంగించారు. పోలీసు చర్య కారణంగానే హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం వచ్చిందని చరిత్ర వక్రికరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కోదండరామ్ అన్నారు.

గడిచిన వందేళ్ళలో భారతదేశంలోని పంజాబ్, బెంగాల్ వంటి ప్రాంతాలలలో మత ఘర్షణలు జరిగినప్పటికీ, తెలంగాణలో హిందూ, ముస్లిం ఘర్షణలు జరగలేదని ప్రొఫెసర్ కాశీం తెలిపారు. ఇందుకు తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ ఉండడం, కార్మికవర్గ శక్తులు, లౌకికవాదులు ఉండడమే కారణమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం, మునుగోడు నియోజకవర్గంలో బిజెపి పాగా వేసేందుకే ఉత్సవాలను నిర్వహిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ మాట్లాడుతూ రానున్న 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రంలోని బిజెపి డ్రామా చేస్తోందని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పచ్చని తెలంగాణ రాష్ట్రంలో మతం నిప్పు పెట్టేందుకే అమిత్ షా హైదరాబాద్ వచ్చారని, హిందూ,ముస్లిం ఘరషణలు రగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిం చారు. మతోన్మాద బిజెపి శక్తులను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

కమ్యూనిస్టులను కాదని ఏ పార్టీ మనుగడ సాధించలేదని హెచ్చరించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎం.కె. మొయినొద్దీన్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వామపక్ష పార్టీలన్నీ ఏకమవ్వాలని,పెరిగిన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేపట్టాలని పిలుపునిచ్చారు. సిపిఐ శ్రేణులునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక మంది వీరనారుల పాత్ర ఉన్నదన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కేవలం ఒక నల్గొండ జిల్లాలోనే మూడువేల మంది ఆసువులు బాసారని, తెలంగాణలో ప్రతి గడపలో, ప్రతి కమ్యూనిస్టు కుటుంబంలో ఒక్కో చరిత్ర ఉంటుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదిడయంలో సిపిఐ విజయవతమైందన్నారు. సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇ.టి.నర్సింహా మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎవరు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని రోజుల్లోనే 1948కి ముందే జాతీయ జెండాను ఎగురవేసిన ఘనత ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు రఫీ అహ్మద్ అని వివరించారు. అలాంటి పోరాటాన్ని హిందూ, ముస్లిం వ్యతిరేక పోరాటంగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News