మెదక్: ఉచితాలు వద్దన్న బిజెపికి బుద్ధి చెప్పాలని, పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నది కెసిఆర్ ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. కొత్తగా ఆసరా పింఛన్లు అందుకుంటున్న 584 మందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక నుంచి మీకు నెల నెల రూ. 2016 అందుతాయని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పింఛన్ 75 రూపాయలు ఇస్తుండేవారని, ఎవరైనా చనిపోతేనే తప్ప వారి స్థానంలో గతంలో కొత్త పెన్షన్లు ఇచ్చేవారు కాదన్నారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200 చేసిందని, కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ్లకు పింఛన్లు ఇవ్వలేదన్నారు. కానీ కెసిఆర్ ప్రభుత్వం మాత్రం ఏకంగా పదింతలు పెంచి, రు. 2016 చేశామన్నారు. పింఛన్ల డబ్బు పెరిగింది పింఛన్ల సంఖ్య పెరిగిందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
కన్న కొడుకు చీర కొనిఇవ్వకపోయినా పెద్ద కొడుకు సిఎం కెసిఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నారని, బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారని చెప్పారు. మాకు కులం లేదు మతం లేదని, పేదలందరికీ భరోసా ఇవ్వడమే కెసిఆర్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తూప్రాన్, గజ్వేల్, మెదక్ లలో మంచి ఆసుపత్రులు వచ్చాయని, కరోనా వల్ల కొంత ఇబ్బంది ఉండేనని, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, పది కిలోల బియ్యం ఇస్తున్నామని, సమయానికి పింఛన్లు ఇస్తామని హరీష్ రావు చెప్పారు.
ఢిల్లీలో కూర్చున్న వారు కాళేశ్వరం మీద విమర్శలు చేస్తున్నారని, భూమికి బరువయ్యే పంట పండుతుందని, కెసిఆర్ రైతు పక్షపాతి కాబట్టి ఇది సాధ్యమైందన్నారు. బిజెపోళ్లు ఉచితాలు వద్దు అంటున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచిత కరెంట్ కాదు ఉత్త కరెంట్ వచ్చేదని చురకలంటించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.