Friday, December 20, 2024

నేడు బిజెపి నవ సంకల్ప సభ….

- Advertisement -
- Advertisement -
నాగర్‌కర్నూల్ సభకు ముఖ్య అతిథిగా నడ్డా హాజరు
సంపర్క్ సే సమర్ధన్‌లో భాగంగా ఇద్దరు ప్రముఖుల నివాసాలకు జెపి
మోదీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ పుస్తకాన్ని అందజేత
మీ దమ్ము చూపాలంటూ బీజేపీ కార్యకర్తలకు బండి పిలుపు

హైదరాబాద్:  మహా జనసంపర్క్ అభియాన్ లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నేడు సాయంత్రం 4 గంటలకు బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా బహిరంగ సభకు హాజరై దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ 9 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు నవ సంకల్ప సభగా నామకరణం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుండి నేరుగా నోవాటెల్ చేరుకుని భోజనం చేస్తారు.

అక్కడి నుండి సంపర్క్ సే సమర్థన్‌లో భాగంగా టోలిచౌక్ లోని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ లోని పద్మశ్రీ ఆనంద శంకర్ జయంతిల నివాసాలకు వెళతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలన విజయాలను వివరించడంతోపాటు మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పుస్తకాలను అందజేస్తారు. అక్కడి నుండి సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ వెళ్లి ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూలు చేరుకుంటారు. నేరుగా జడ్పీ హైస్కూలు మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. దాదాపు గంటన్నరపాటు సభలోనే ఉంటారు. ఈ సందర్భంగా మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అభివృద్ది, సంక్షేమ పథకాలలను వివరిస్తారు.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ సభ ఏర్పాట్లపై నాగర్ కర్నూలు జిల్లాలోని పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో బీజేపీ దమ్ము చూపే అవకాశం వచ్చిందని, జేపీ నడ్డా హాజరయ్యే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి సత్తా చాటాలని పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తప్పుడు ప్రచారాలతో అయోమయం సృష్టిస్తూ కలిసి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో జేపీ నడ్డా హాజరయ్యే బహిరంగ సభ కీలకం కానుందని, ఈ తరుణంలో ప్రతి ఒక్క కార్యకర్త సభకు హాజరుకావడంతోపాటు తనతోపాటు ఒక్కో కార్యకర్త 50 మందిని తీసుకుని కొచ్చి భారతమాత నినాదాలతో బహిరంగ సభ మారుమోగాలని, కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా నాగర్ కర్నూలు కార్యకర్తలు సత్తా చాటాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News