బెంగళూరు: శివమొగ్గకు చెందిన బిజెపి ఎంఎల్‌ఎ కె.ఎస్. ఈశ్వరప్ప రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేయబోవడంలేదని తేల్చేశారు. ఆయన కర్నాటక మాజీ ఉపముఖ్యమంత్రి కూడా. ఈసారి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. ఈశ్వరప్ప తాను అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేయబోవడంలేదన్న విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డాకు లేఖ ద్వారా తెలియజేశారు. ఆ లేఖ ఇప్పుడు వైరల్‌గా సర్కులేట్ అవుతోంది. తనకు ఏ నియోజకవర్గం కేటాయించొద్దని కూడా ఆయన తన లేఖలో నడ్డాను కోరారు.
ఈశ్వరప్ప తరచూ అనేక వివాదాలకు కేంద్రం అయ్యారు. ఆయన ప్రకటనలు, ఆరోపణల కారణంగానే ఆయన వివాదాల్లో చిక్కుకుంటూ వచ్చారు. ఆయన నడ్డాకు రాసిన కన్నడ భాష లేఖలో తాను ఎన్నికల రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.
‘పార్టీ నాకు గత 40 ఏళ్లుగా బాధ్యతలు అప్పగించింది. నేను బూత్ ఇన్‌ఛార్జీ నుంచి రాష్ట్ర పార్టీ చీఫ్ వరకు పనిచేశాను. నేను ఉపముఖ్యమంత్రిని కూడా అయ్యాను’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈశ్వరప్ప ఇంత హఠాత్తుగా ఎందుకు రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నారో అంతుపట్టకుండా ఉంది. అయితే తన కొడుకు కె.ఈ.కంఠేశ్ తన సీటు నుంచే బిజెపి టిక్కెట్టు దక్కేందుకే ఆయన ఇలా తప్పుకుంటున్నారని వినికిడి. గత నెల బిజెపి ఎంఎల్‌సి అయనూర్ మంజునాథ్ కె.ఎస్. ఈశ్వరప్ప లేక ఆయన కుమారుడు కె.ఈ.కంఠేశ్‌ను ఎన్నికల్లో తనతో పోటీపడాల్సిందిగా సవాలు విసిరారు. పార్టీని నిర్మించేందుకు తాము ఆయనతో కలిసి పనిచేశామన్నారు. పైగా ఈశ్వరప్ప తనపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా ఆరోపించారు.
224 సీట్లున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 13న వెలువడనున్నాయి. సంఖ్యపరంగా చూసినప్పుడు కర్నాటక ఏడవ అతిపెద్ద అసెంబ్లీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్, జెడి(ఎస్) ప్రధాన పోటీ పార్టీలుగా ఉన్నాయి. బిజెపి ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీలో బిజెపికి 119 ఎంఎల్‌ఎలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 75 ఎంఎల్‌ఎలు ఉన్నారు. జెడి(ఎస్) కు 28 ఎంఎల్‌ఎలు ఉన్నారు. ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ మాత్రమే తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో 124 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో 60 నుంచి 69 మంది ఎంఎల్‌ఎలను తిరిగి నిలబెడుతున్నది. కాంగ్రెస్ రెండో జాబితాలో 42 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. వారిలో కొందరు బిజెపి, జెడి(ఎస్) నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన వారి పేర్లున్నాయి.
BJP MLA from Shivamogga KS Eashwarappa writes to BJP National President JP Nadda stating that he has decided not to contest the upcoming Karnataka Assembly elections pic.twitter.com/DVKeANnAD0
— ANI (@ANI) April 11, 2023